ఆదికాండము 43 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక 2 వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి–మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా 3 యూదా అతని చూచి–ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనేగాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. 4 కాబట్టి నీవు మా తమ్ముని మాతోకూడ పంపినయెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము. 5 నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు–మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను. 6 అందుకు ఇశ్రాయేలు–మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా 7 వారు–ఆ మనుష్యుడు–మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మునుగూర్చియు మా బంధువులనుగూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి–మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి. 8 యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి–ఆ చిన్న వానిని నాతోకూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము; 9 నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నామీద ఎల్లప్పుడును ఉండును. 10 మాకు తడవు కాక పోయినయెడల ఈపాటికి రెండవమారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా 11 వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితో–అట్లయిన మీ రీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి. 12 రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేతపట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును; 13 మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి. 14 ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసినయెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. 15 ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి. 16 యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహ కునితో–ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. 17 యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను. 18 ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందునవారు భయపడి–మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపెట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి. 19 వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి 20 –అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. 21 అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితిమి. 22 ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితిమి; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. 23 అందుకతడు–మీకు క్షేమమగునుగాక భయపడకుడి; మీపితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్దకు తీసికొని వచ్చెను. 24-25 ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి. 26 యోసేపు ఇంటికి వచ్చి నప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి. 27 అప్పుడు –మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికియున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు 28 –నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. 29 అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి–మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి –నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. 30 అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. 31 అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్నుతాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను. 32 అతనికిని వారికిని అతనితో భోజనముచేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము. 33 జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠునివరకు వారు అతని యెదుట తమతమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. 34 మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India