ఆదికాండము 22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రా హామా, అనిపిలువగా అతడు–చిత్తము ప్రభువా అనెను. 2 అప్పుడాయన–నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను. 3 తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను. 4 మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి 5 తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి 6 దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా 7 ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో–నా తండ్రీ అనిపిలిచెను; అందుకతడు–ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు–నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా 8 అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను. 9 ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. 10 అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా 11 యెహోవాదూత పరలోకమునుండి–అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు–చిత్తము ప్రభువా అనెను. 12 అప్పుడు ఆయన–ఆ చిన్నవానిమీద చెయ్యివేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్న దనెను. 13 అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. 14 అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత–యెహోవా పర్వతముమీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడును. 15 యెహోవాదూత రెండవమారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను 16 –నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున 17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. 18 మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను. 19 తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను. 20 ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుప బడినదేమనగా–మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను. 21 వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు, 22 కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు. బెతూయేలు రిబ్కాను కనెను. 23 ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను. 24 మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును తహ షును మయకాను కనెను. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India