Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

ఎజ్రా 1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

2 –పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా – ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

3 కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడై యుండునుగాక.

4 మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.

5 అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితోకూడుకొని వచ్చి, యెరూషలేములోఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.

6 మరియు వారి చుట్టు నున్నవారందరును స్వేచ్ఛగా అర్పించినవిగాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.

7 మరియు నెబుకద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవతలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములనురాజైన కోరెషు బయటికి తెప్పించెను.

8 పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.

9 వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును

10 ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియైయుండెను.

11 బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోను చెరలోనుండి విడిపింపబడినవారితోకూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ