Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

నిర్గమ 38 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మరియు అతడు తుమ్మకఱ్ఱతో దహనబలిపీఠమును చేసెను. దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు, అది చచ్చౌకమైనది. దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను.

2 దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి; దానికి ఇత్తడిరేకు పొదిగించెను.

3 అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటిని, అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటిని ఇత్తడితో చేసెను.

4 ఆ బలిపీఠము నిమిత్తము దాని జవక్రింద దాని నడిమివరకు లోతుగానున్న వలవంటి ఇత్తడి జల్లెడను చేసెను.

5 మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱలుండు నాలుగు ఉంగరములను పోతపోసెను.

6 ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను.

7 ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకఱ్ఱలు చొనిపెను; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను.

8 అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను.

9 మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున, అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను.

10 వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది. ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

11 ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి; వాటి స్తంభములు ఇరువది, వాటి యిత్తడి దిమ్మలు ఇరువది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

12 పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి; వాటి స్తంభములు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

13 తూర్పువైపున, అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు;

14 ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

15 అట్లు రెండవ ప్రక్కను, అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

16 ఆవరణము చుట్టునున్న దాని తెరలన్నియు పేనిన సన్ననారవి.

17 స్తంభముల దిమ్మలు రాగివి, స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి. వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండి బద్దలతో కూర్పబడెను.

18 ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణములుగలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటాపనిది. దాని పొడుగు ఇరువది మూరలు; దాని యెత్తు, అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు.

19 వాటి స్తంభములు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి వంకులు వెండివి.

20 వాటి బోదెలకు వెండిరేకు పొదిగింప బడెను, వాటి పెండెబద్దలు వెండివి, మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నియు ఇత్తడివి.

21 మందిరపదార్థముల మొత్తము, అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయులచేత మోషే మాటచొప్పున లెక్కపెట్టించెను.

22 యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను.

23 దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడైయుండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైనపని కల్పించువాడును నీల ధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడునై యుండెను.

24 పరిశుద్ధస్థలవిషయమైన పని అంతటిలోను పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు, అనగా ప్రతిష్ఠింప బడిన బంగారు పరిశుద్ధస్థలపు తులము చొప్పున నూట పదహారుమణుగుల ఐదువందల ముప్పది తులములు.

25 సమాజములో చేరినవారి వెండి పరిశుద్ధస్థలపు తులముచొప్పున నాలుగువందల మణుగుల వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులములు.

26 ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమందిలో తలకొకటికి అరతులము.

27 ఆ నాలుగువందల వెండి మణుగులతో పరిశుద్ధస్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును; అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగులకు చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను.

28 వెయ్యిన్ని ఐదువందల డెబ్బదియైదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను.

29 మరియు ప్రతిష్ఠింపబడిన యిత్తడి రెండువందల ఎనుబది మణుగుల రెండువేల నాలుగువందల తులములు.

30 అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణములన్నిటిని

31 చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు మేకులన్నిటిని చేసెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ