Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

అపొస్తలుల 27 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమై నప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి.

2 ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను.

3 మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను.

4 అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి.

5 మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి.

6 అక్కడ శతాధిపతి ఇటలీవెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను.

7 అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి.

8 బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దానిదగ్గర లసైయ పట్టణముండెను.

9 చాల కాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను.

10 అప్పుడు పౌలు–అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.

11 అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.

12 మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయవ్యదిక్కులతట్టుననున్న క్రేతురేవై యున్నది.

13 మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.

14 కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను.

15 దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి.

16 తరువాత కౌద అన బడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను.

17 దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసి కొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.

18 మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.

19 మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.

20-21 కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను. వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారిమధ్యను నిలిచి–అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును.

22 ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు.

23 నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి–పౌలా, భయపడకుము;

24 నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను.

25 కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.

26 అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.

27 పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడు చున్నదని యూహించి

28 బుడుదువేసి చూచి యిరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి.

29 అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి.

30 అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి.

31 అందుకు పౌలు–వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను.

32 వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి.

33-34 తెల్లవారుచుండగా పౌలు– పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహా రము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.

35 ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.

36 అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి.

37 ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము.

38 వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి.

39 ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనయెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి

40 గనుక లంగరుల త్రాళ్లుకోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని

41 రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పెట్టించిరి. అందువలన అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను.

42 ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని

43 శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు

44 కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కలమీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ