Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 రాజులు 24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగా

2 యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.

3 మనష్షే చేసిన క్రియలన్నిటినిబట్టియు, అతడు నిరపరాధులను హతముచేయుటనుబట్టియు, యూదావారు యెహోవా సముఖమునుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను.

4 అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.

5 యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించినదానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

6 యెహోయాకీము తన పితరులతోకూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.

7 బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తురాజు వశమున నున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తురాజు ఇక నెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను.

8 యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమి దేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములు ఏలెను. యెరూషలేమువాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి.

9 అతడు తన తండ్రి చేసినదానంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.

10 ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి.

11 వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను.

12 అప్పుడు యూదారాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతులును అతని పరివారమును బయలువెళ్లి బబులోనురాజు నొద్దకురాగా బబులోనురాజు యేలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను.

13 మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలురాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.

14 అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైనవారు తప్ప మరి ఎవరునులేకుండ యెరూషలేము పట్టణమంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేలమందిని, వీరు గాక కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను.

15 అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపెట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను.

16 ఏడు వేలమంది పరాక్రమశాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపెట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను.

17 మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.

18 సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియొక సంవత్సరములవాడు; అతడు యెరూషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను.

19 అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయాయొక్క కుమార్తెయగు హమూటలు. యెహోయాకీముయొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.

20 యూదావారిమీదను యెరూషలేమువారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమునుబట్టి తన సముఖములోనుండి వారిని తోలివేయుటకై బబులోనురాజు మీద సిద్కియా తిరుగబడెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ