Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 రాజులు 16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను.

2 ఆహాజు ఏలనారంభించి నప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.

3 అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలుచేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను.

4 మరియు అతడు ఉన్నతస్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.

5 సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరిగాని అతనిని జయింపలేక పోయిరి.

6 ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.

7 ఇట్లుండగా ఆహాజు యెహోవామందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి

8 –నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా

9 అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.

10 రాజైన ఆహాజు అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి, దాని పోలికెను, మచ్చును, దాని పని విధ మంతయును యాజకుడైన ఊరియాకు పంపెను.

11 కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.

12 అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి

13 దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.

14 మరియు యెహోవా సన్నిధినున్న యిత్తడి బలిపీఠమును మందిరము ముంగిటిస్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.

15 అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగా–ఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజుచేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.

16 కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను.

17 మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీద నున్న తొట్టిని తొలగించెను, ఇత్తడి యెడ్లమీద నున్న సముద్రమును దింపి రాతి కట్టుమీద దానిని ఉంచెను.

18 మరియు అతడు అష్షూరు రాజునుబట్టి విశ్రాంతిదినపు ఆచరణకొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యెహోవా మందిరమునుండి తీసివేసెను.

19 ఆహాజుచేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

20 ఆహాజు తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ