Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

1 సమూయేలు 8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను.

2 అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,

3 వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా

4 ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి

5 –చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.

6 –మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.

7 అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా–జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.

8 వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.

9 అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.

10 సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి

11 ఈలాగున చెప్పెను–మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు.

12 మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.

13 మీ కుమార్తెలను భక్ష్యకా రిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనును.

14 మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును.

15 మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవభాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును.

16 మీ దాసులను మీ పని కత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును.

17 మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు.

18 ఆ దినమున మీరు కోరు కొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.

19 అయినను జనులు సమూయేలుయొక్క మాట చెవిని బెట్టనొల్లక–ఆలాగున కాదు,

20 జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.

21 సమూయేలు జనులయొక్క మాట లన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను

22 గనుక యెహోవా–నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలు–మీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ