1 సమూయేలు 24 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. 2 అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలాపర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను. 3 మార్గముననున్న గొఱ్ఱెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక 4 దావీదు జనులు–అదిగో–నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను. 5 సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి 6 –ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. 7 ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను. 8 అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి–నా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి 9 సౌలుతో ఇట్లనెను–దావీదు నీకు కీడుచేయనుద్దే శించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? 10 ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి–ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని. 11 నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. 12 నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను. 13 పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను. 14 ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా? 15 యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. 16 దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు–దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి 17-18 దావీదుతో ఇట్లనెను – యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు. 19 ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలుచేయునుగాక. 20 నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును. 21 కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను 22 అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లి పోయిరి. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India