Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

1 రాజులు 4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను.

2 అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు;

3 షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖకుడై యుండెను;

4 యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు.

5 నాతాను కుమారుడైన అజర్యా అధికారులమీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను;

6 అహీషారు గృహ నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి.

7 ఇశ్రాయేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను.

8 వారి పేళ్లు ఇవే; ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు;

9 మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెధానానులోను దెకెరు కుమారుడు;

10 అరుబ్బోతులో హెసెదు కుమారుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను.

11 మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొమోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.

12 మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవతలి స్థలమువరకును వ్యాపించుచున్నది.

13 గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలాదులోనుండిన మనష్షే కుమారుడైన యాయీరు గ్రామములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరువది గొప్ప పట్టణములుగల ప్రదేశము.

14 ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.

15 నఫ్తాలీ దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.

16 ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.

17 ఇశ్శాఖారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను.

18 బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను.

19 గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషానురాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను; అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి.

20 అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.

21 నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.

22 ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,

23 క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱెలును, ఇవియుగాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను.

24 యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతలనున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.

25 సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమతమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.

26 సొలొమోను రథములకు నలువదివేల గుఱ్ఱపు శాలలును రౌతులకు పండ్రెండువేల గుఱ్ఱములును ఉండెను.

27 మరియు రాజైన సొలొమోనునకునురాజైన సొలొమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికందరికిని ఏమియు తక్కువకాకుండ అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమునుబట్టి ఆహారము సంగ్రహముచేయుచు వచ్చెను.

28 మరియు గుఱ్ఱములును పాటుపశువులును ఉన్న ఆయాస్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.

29 దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను

30 గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానముకంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను.

31 అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రా హీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తి చుట్టునున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను.

32 అతడు మూడువేలసామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.

33 మరియు లెబానోనులోఉండు దేవదారు వృక్షమునేగాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనేగాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.

34 అతని జ్ఞానపుమాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు, జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ