Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

ప్రకటన 16 - తెలుగు సమకాలీన అనువాదము


దేవుని ఉగ్రత గల ఏడు పాత్రలు

1 అప్పుడు దేవాలయంలో నుండి ఒక పెద్ద స్వరం ఏడుగురు దేవదూతలతో, “మీరు వెళ్ళి దేవుని ఉగ్రత గల ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించండి” అని బిగ్గరగా చెప్పడం విన్నాను.

2 మొదటి దేవదూత వెళ్ళి భూమి మీద తన పాత్రను కుమ్మరించాడు. అప్పుడు ఆ మృగం యొక్క ముద్రగలవారికి, దాని విగ్రహాన్ని పూజించేవారికి భయంకరమైన నొప్పి కలిగించే అసహ్యమైన కురుపులు పుట్టాయి.

3 రెండవ దేవదూత సముద్రం మీద తన పాత్రను కుమ్మరించిన వెంటనే సముద్రపు నీరు చనిపోయినవారి రక్తంలా మారింది; దానిలోని ప్రతి ప్రాణి చనిపోయింది.

4 మూడవ దేవదూత తన పాత్రను నదులు, నీటి ఊటల మీద కుమ్మరించినప్పుడు అవి రక్తంగా మారాయి.

5 అప్పుడు జలాల మీద అధికారం కలిగిన దేవదూత, “ఓ పరిశుద్ధుడా! నీవు ఉన్నవాడవు, ఉండిన వాడవు, ఈ తీర్పు తీర్చడానికి నీవు న్యాయవంతుడవు.

6 ఎందుకంటే, వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కనుక, వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు” అని చెప్పడం విన్నాను.

7 అప్పుడు బలిపీఠం ఈ విధంగా బదులిచ్చింది, “అవును, ఓ సర్వశక్తిమంతుడా ప్రభువైన దేవా, నీ తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.”

8 నాలుగవ దేవదూత సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు అగ్నితో ప్రజలను కాల్చడానికి సూర్యునికి అనుమతి ఇవ్వబడింది.

9 ప్రజలు ఆ భయంకరమైన వేడికి కాల్చబడినప్పుడు వారు ఈ తెగుళ్ళను ఆపగల అధికారం ఉన్న దేవుని నామాన్ని దూషించారు, పశ్చాత్తాపపడడానికి, ఆయనను మహిమపరచడానికి వారు నిరాకరించారు.

10 ఐదవ దేవదూత తన పాత్రను ఆ మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు దాని రాజ్యమంతా చీకటి కమ్మింది. ప్రజలు ఆ వేదనను తట్టుకోలేక తమ నాలుకలను కొరుక్కున్నారు.

11 వారికి కలిగిన వేదనకు, కురుపులకు వారు పరలోక దేవుని దూషించారు కానీ తాము చేసిన వాటి గురించి పశ్చాత్తాపపడడానికి వారు తిరస్కరించారు.

12 ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహానది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది.

13 తరువాత కప్పలను పోలిన మూడు అపవిత్రాత్మలు నాకు కనబడ్డాయి; అవి ఘటసర్పం నోటి నుండి, మృగం నోటి నుండి మరియు అబద్ధ ప్రవక్త నోటి నుండి బయటకు వచ్చాయి.

14 అవి సూచక క్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను ప్రోగు చేయడానికి అవి వారి దగ్గరకు వెళ్ళాయి.

15 అందుకే క్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి, “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి దుస్తులను ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”

16 ఆ అపవిత్రాత్మలు రాజులనందరిని హెబ్రీ భాషలో “హర్మగిద్దోను” అని పిలువబడే స్థలంలో పోగుచేశాయి.

17 ఏడవ దేవదూత గాలిలో తన పాత్రను కుమ్మరించినప్పుడు, దేవాలయంలోని సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక సమాప్తం అయింది!” అని చెప్పింది.

18 అప్పుడు మెరుపుల వెలుగులు, ధ్వనులు, ఉరుములు, భయంకరమైన భూకంపం వచ్చాయి. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండి ఇలాంటి భూకంపం కలుగలేదు. అది చాలా భయంకరమైన భూకంపం.

19 ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చాడు.

20 అప్పుడు ప్రతి ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనబడలేదు.

21 ఆకాశం నుండి మనుష్యుల మీద భారీ వడగండ్లు పడ్డాయి. ఆ వడగండ్లు ఒక్కొక్కటి సుమారు నలభై ఐదు కిలోల బరువు ఉన్నాయి. ఆ వడగండ్ల తెగులు చాలా భయంకరంగా ఉండినందున ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రజలు దేవుని దూషించారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ