Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

హెబ్రీయులకు 10 - తెలుగు సమకాలీన అనువాదము


అందరి కొరకు ఒక్కసారే క్రీస్తు అర్పించబడుట

1 ధర్మశాస్త్రం రాబోయే మంచి విషయాల నీడ మాత్రమే కాని వాస్తవరూపాలు కావు. ఈ కారణంగా, సంవత్సరం తరువాత సంవత్సరం, అనంతంగా పునరావృతమయ్యే అవే బలుల ద్వారా, ఆరాధించడానికి వచ్చేవారిని అది పరిపూర్ణం చేయలేదు.

2 లేకపోతే, వారు బలులు అర్పించడం మానేసేవారు కాదా? ఎందుకంటే ఆరాధించే వారు ఒక్కసారిగా శుద్ధులై ఉండేవారు, ఇకపై వారి పాపాల గురించి దోషులుగా భావించేవారు కాదు.

3 అయితే ఆ బలులు ప్రతి సంవత్సరం పాపాల గురించి వారికి గుర్తు చేసేవిగా ఉండేవి.

4 ఎద్దుల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యం.

5 అందుకని, క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు ఇలా అన్నారు: “నీవు బలులను అర్పణలను కోరలేదు, కాని నీవు నాకొక శరీరాన్ని సిద్ధపరచావు;

6 దహన బలులతో పాపపరిహారార్థ బలులతో నీవు సంతోషించలేదు.

7 అప్పుడు నేనిలా అన్నాను, ‘నేను ఇక్కడే ఉన్నా; గ్రంథపు చుట్టలో నా గురించి వ్రాయబడినట్లుగా నా దేవా, నీ చిత్తం చేయడానికి నేను వచ్చాను.’ ”

8 ఆయన మొదట ఇలా అన్నాడు, అవి ధర్మశాస్త్ర ప్రకారమే అర్పించబడినప్పటికి, నీవు “బలులు, అర్పణలు, దహన బలులు, పాపపరిహారార్థ బలులను కోరలేదు, వాటిని బట్టి నీవు సంతోషించలేదు.”

9 తరువాత ఆయన, “నేను ఇక్కడే ఉన్నాను, నీ చిత్తం చేయడానికి నేను వచ్చాను” అని చెప్పాడు. ఆయన రెండవదానిని స్థాపించడానికి మొదటి దానిని ప్రక్కన పెడతాడు.

10 ఆ చిత్తాన్ని బట్టి, యేసు క్రీస్తు శరీరాన్ని అందరి కొరకు ఒక్కసారే అర్పించుట ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము.

11 ప్రతి దినం ప్రతి యాజకుడు నిలబడి మతపరమైన విధులు నిర్వర్తిస్తాడు; పాపాలను ఎన్నటికిని తీసివేయలేని అదే బలులను మరలా మరలా అర్పిస్తాడు.

12 అయితే ఈ యాజకుడు పాపాల కొరకు అన్ని కాలాలకు ఒకే ఒక బలిని అర్పించి, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు,

13 ఆ సమయం నుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేవరకు ఆయన అక్కడ వేచివుంటాడు.

14 పరిశుద్ధులుగా చేయబడిన వారిని, ఒకే ఒక బలి ద్వారా ఆయన శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు.

15 పరిశుద్ధాత్మ కూడా దీనిని గురించి మనకు సాక్ష్యమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు:

16 “ఆ కాలం తరువాత నేను వారితో చేసే నిబంధన ఇదే అని ప్రభువు చెప్పారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను.”

17 ఆయన ఇంకా ఇలా అన్నాడు: “వారి పాపాలను, అధర్మ క్రియలను నేను ఇక ఎన్నడు జ్ఞాపకం ఉంచుకోనని.”

18 ఇవి క్షమింపబడినప్పడు, పాప పరిహారానికి ఇక బలి అవసరం ఉండదు.


విశ్వాసంలో పట్టుదలకు పిలుపు

19 కనుక, సహోదరీ సహోదరులారా, యేసు తన శరీరమనే తెర ద్వారా మనకొరకు తెరవబడిన సజీవమైన ఒక క్రొత్త మార్గం ద్వారా,

20 యేసు రక్తాన్ని బట్టి అతి పరిశుద్ధస్థలంలోకి ప్రవేశిస్తామనే నమ్మకాన్ని మనం కలిగివున్నాము.

21 దేవుని గృహంపైన ఒక గొప్ప యాజకుని మనం కలిగివున్నాము.

22 కనుక మన హృదయంలోని దోషాలు తొలగిపోయేలా శుద్ధిచేసుకొని, మన శరీరాలను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచుకొని, నిష్కపటమైన హృదయంతో విశ్వాసం వల్ల కలిగే పూర్తి నమ్మకంతో దేవుని సమీపిద్దాం.

23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకొందాం.

24 ప్రేమ మరియు మంచిపనుల పట్ల మనం ఒకరినొకరం ఎలా ప్రేరేపించవచ్చో ఆలోచిద్దాం,

25 కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సాహించుకుందాం.

26 సత్యం మనకు తెలియజేయబడిన తరువాత కూడా ఒకవేళ మనం పాపాలు చేస్తూనేవుంటే, ఆ పాపాలను తొలగించగల బలి ఏది లేదు,

27 అయితే తీర్పు కొరకు, దేవుని శత్రువులను దహించబోయే ప్రచండమైన అగ్ని కొరకు మాత్రమే భయంతో ఎదురుచూడటం మిగిలివుంటుంది.

28 మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవారు ఎవరైనా సరే ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల సాక్ష్యాన్ని బట్టి దయ లేకుండా చంపివేయబడ్డారు.

29 అలాంటప్పుడు దేవుని కుమారుని తమ పాదాల క్రింద త్రొక్కినవారు, తమను పరిశుద్ధపరచే నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదానిగా భావించినవారు, కృప గల ఆత్మను అవమానించినవారు ఎంత గొప్ప తీవ్రమైన శిక్షను పొందుతారో మీరు ఊహించగలరా?

30 “పగ తీర్చుకోవడం నా పని, నేను ప్రతిఫలాన్ని ఇస్తాను” అని, మరలా “ప్రభువు, తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని చెప్పిన వాడు మనకు తెలుసు.

31 సజీవుడైన దేవుని చేతుల్లో పడడం మహా భయంకరమైన విషయం.

32 మీరు వెలుగును పొందిన తరువాత, అనేక శ్రమలతో నిండిన గొప్ప పోరాటాన్ని మీరు ఓర్చుకున్న ప్రారంభపు రోజులను జ్ఞాపకం చేసుకోండి.

33 కొన్నిసార్లు మీరు బహిరంగంగా అవమానపరచబడ్డారు, హింసించబడ్డారు; కొన్నిసార్లు మీరు అలాంటివాటినే ఎదుర్కొంటున్న వారి ప్రక్కనే ఉండి వారిని ఆదరించారు.

34 చెరసాలలో వేయబడిన వారితో పాటు మీరు శ్రమ అనుభవించారు, మీ ఆస్తులను దోచుకున్నా సంతోషంగా స్వీకరించారు, వాటికంటే శాశ్వతంగా నిలిచే మరింత మేలైన ఆస్తులను కలిగివున్నారని మీకు తెలుసు కనుక మీరు వాటిని భరించారు.

35 కనుక మీ ధైర్యాన్ని కోల్పోవద్దు; దానికి మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు.

36 దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.

37 “ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.”

38 ఇంకా, “నా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. అయితే వెనుతిరిగే వానిలో నేను ఆనందించను.”

39 అయితే మనం విశ్వాసం కలిగిన, రక్షించబడిన వారికే గాని, వెనక్కి తిరిగి నాశనమయ్యేవారికి చెందినవారం కాదు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ