1 థెస్సలొనీకయులకు 3 - తెలుగు సమకాలీన అనువాదము1 కనుక మేము ఇంకా వేచి ఉండలేక మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. 2 మా సహోదరుడు దేవుని పరిచర్యయైన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడంలో మా తోటిపనివాడైన తిమోతిని, మీ విశ్వాసంలో మిమ్మల్ని ప్రోత్సహించి బలపరచడానికి పంపించాము, 3 ఎందుకంటే, అప్పుడు మీలో ఎవరు ఏ శ్రమల వలన కలవరం చెందకుండా వుండాలని. అయినా మనం శ్రమలను ఎదుర్కోవలసి ఉందని మీకు బాగా తెలుసు. 4 నిజానికి, మనకు శ్రమలు వస్తాయని, మేము మీతో ఉన్నపుడు మీతో చెప్తూనే ఉన్నాము. అలాగే జరిగిందని మీకు తెలుసు. 5 ఏదో ఒక రీతిగా శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడని, అప్పుడు మేము చేసిన పని అంతా వ్యర్థమై పోతుందని నేను భయపడ్డాను, గనుకనే ఇక నేను వేచివుండలేక మీ విశ్వాసం గురించి తెలుసుకోవాలని తిమోతిని పంపించాను. తిమోతి యొక్క ప్రోత్సాహకరమైన నివేదిక 6 అయితే ఇప్పుడే తిమోతి మీ నుండి మా దగ్గరకు వచ్చి, మీ విశ్వాసం గురించి, మీరు చూపిన ప్రేమ గురించి మంచి వార్తను మాకు అందించాడు. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ మాకు సంబంధించిన మంచి జ్ఞాపకాలతో జ్ఞాపకం చేసుకుంటూ, మేము మిమ్మల్ని చూడాలని ఎలా ఆరాటపడుతున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారని అతడు మాతో చెప్పాడు. 7 కనుక సహోదరీ సహోదరులారా, మేము హింసించబడినప్పుడు బాధను కష్టాలను అనుభవిస్తున్న సమయంలో మీ విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు మేము ఆదరణ పొందుకున్నాము. 8 ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే. 9 మీ వలన దేవుని సన్నిధిలో మేము పొందిన సంతోషమంతటిని బట్టి దేవునికి మీ కొరకు కృతజ్ఞతాస్తుతులు ఎంతని చెల్లించాలి? 10 మిమ్మల్ని మరలా చూడాలని మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని రాత్రింబగళ్ళు మీ కొరకు ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నాం. 11 మన తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మేము త్వరగా మీ దగ్గరకు రావడానికి మార్గం సరాళం చేయును గాక! 12 మేము మీ పట్ల ప్రేమ చూపినట్లే, విశ్వాసులైన మీరు ఒకరి పట్ల ఒకరు మీ ప్రేమను వృద్ధిపొందించుకొంటూ ఇతరులందరికి ఆ ప్రేమను అందించేలా ప్రభువు చేయును గాక. 13 మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.