Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

1 పేతురు 3 - తెలుగు సమకాలీన అనువాదము

1 అలాగే భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడి ఉండండి, ఒకవేళ వారిలో ఎవరైన దేవుని వాక్యాన్ని అంగీకరించనివారు ఉంటే, మీరు ఒక్క మాట కూడా పలకాల్సిన అవసరం లేకుండానే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు,

2 అప్పుడు భయభక్తులతో, పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనిస్తారు.

3 తల వెంట్రుకలను అలంకరించుకోవడం, బంగారు ఆభరణాలను ధరించడం, విలువైన వస్త్రాలు వేసుకోవడం అనే బాహ్య సౌందర్యం కాక,

4 మీ సౌందర్యం అంతరంగికమైనదై ఉండాలి, అది మృదువైన, సాధువైన స్వభావం గల ఆత్మ యొక్క అక్షయసౌందర్యం. అదే దేవుని దృష్టిలో అమూల్యమైనది.

5 ఎలాగంటే, భక్తిరాండ్రయిన పూర్వకాలపు స్త్రీలు దేవునిలో నిరీక్షణ ఉంచి ఇలా తమ సౌందర్యాన్ని పోషించుకొంటూ, తమ భర్తలకు లోబడి ఉన్నారు,

6 శారా అలాంటిదే, ఆమె అబ్రాహాముకు లోబడి అతన్ని తనకు యజమానుడని పిలిచింది. మీరు సత్కార్యం చేసిన వారై దేనికి బెదరని వారైతే ఆమెకు బిడ్డలవుతారు.

7 భర్తలారా, అలాగే మీరు మీ భార్యలు జీవం అనే కృపావరంలో మీతో జతపనివారై ఉన్నారని ఎరిగి సగౌరవంగా, ఉదారంగా వారితో జీవించండి, స్త్రీలు బలహీనులని మీకు తెలుసు గదా, మీ ప్రార్థనలకు అడ్డు రాకుండా ఇలా చేయండి.


మంచి చేయుట కొరకు శ్రమపడుట

8 చివరిగా, మీరందరు, ఏక మనస్కులు, సానుభూతి కలవారై ఉండి, పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయం కలవారై ఉండండి.

9 కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి, దానికి బదులుగా ఆశీర్వదించండి, ఎలాగంటే దేవుడు మిమ్మల్ని పిలిచినపుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆశీర్వాదం.

10 ఎందుకంటే, “ఎవరు జీవాన్ని ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటారో వారు చెడ్డ దానిని పలుకకుండా తమ నాలుకను కాచుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి.

11 వారు కీడు నుండి తొలగి మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదకి దాని వెంటాడాలి.

12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనలను లక్ష్యపెడుతున్నాయి, కాని, ప్రభువు ముఖం కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది.”

13 మంచి చేయాలని మీకు ఆసక్తి ఉంటే, మీకు హాని చేసేది ఎవడు?

14 మీరొకవేళ, నీతికొరకు శ్రమపడినా, మీరు ధన్యులు. “వారి బెదిరింపుకు భయపడకండి, కలవరపడకండి.”

15 మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైన ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతోను సమాధానం చెప్పండి.

16 మీ మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోండి, ఎలాగంటే, మిమ్మల్ని ఎవరైన దూషిస్తే, అప్పుడు క్రీస్తులో ఉన్న మీ మంచి ప్రవర్తన గురించి చెడుగా మాట్లాడేవారు తమ మాటలకు తామే సిగ్గుపడతారు.

17 అదే దేవుని చిత్తమైతే, కీడు చేసిన బాధపడడం కంటే, మేలు చేసి బాధపడడమే మేలు.

18 ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకొనిరావడానికి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు.

19 ఆయన సజీవుడైన తరువాత, అనగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు;

20 నోవహు ఓడను నిర్మిస్తున్న రోజుల్లో, దేవునికి అవిధేయంగా ఉన్న వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనంతో వేచివున్నాడు, ఓడలోని కొద్దిమంది, ఎనిమిది మంది మాత్రమే నీటి నుండి రక్షించబడ్డారు.

21 ఈ నీరే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది, శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు గాని, యేసు క్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షిని అనుగ్రహిస్తుంది.

22 ఆయన పరలోకానికి వెళ్ళి దూతలమీద, అధికారుల మీద, శక్తులమీద అధికారం పొందినవాడై, దేవుని కుడి వైపున ఉన్నారు.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ