Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

జెకర్యా 4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


బంగారు దీపస్తంభం, రెండు ఒలీవచెట్లు

1 అప్పుడు నాతో మాట్లాడిన దూత తిరిగివచ్చి నిద్రపోతున్న వాన్ని లేపినట్లు నన్ను లేపాడు.

2 “నీకు ఏం కనబడుతుంది?” అని నన్ను అడిగాడు. అందుకు నేను, “బంగారు దీపస్తంభం, దాని మీద ఉన్న గిన్నె, ఏడు దీపాలు, దీపాలకున్న ఏడు గొట్టాలు నాకు కనిపిస్తున్నాయి.

3 అంతే కాకుండా ఆ దీపస్తంభానికి కుడి వైపున ఒకటి ఎడమవైపున ఒకటి ఉన్న రెండు ఒలీవచెట్లు అక్కడ కనిపిస్తున్నాయి” అన్నాను.

4 నాతో మాట్లాడిన దూతను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను.

5 అందుకా దూత, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. అందుకు నేను, “నా ప్రభువా, నాకు తెలియదు” అని చెప్పాను.

6 అప్పుడతడు నాతో ఇలా చెప్పాడు, “జెరుబ్బాబెలు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: ‘శక్తి వలన గాని బలం వలన గాని ఇది జరుగదు కాని నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

7 “మహా పర్వతమా! నీవు ఎంతటి దానివి? జెరుబ్బాబెలు ఎదుట నీవు నేలమట్టం అవుతావు. అప్పుడు ‘దేవుడు దీవిస్తారు గాక! దేవుడు దీవిస్తారు గాక!’ అని కేకలు వేస్తుండగా అతడు పైరాయిని తీసుకువస్తాడు.”

8 తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరకు ఇలా వచ్చింది:

9 “జెరుబ్బాబెలు చేతులు ఈ ఆలయపు పునాదిని వేశాయి; అంతే కాకుండా అతని చేతులే దానిని ముగిస్తాయి. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు.

10 “చిన్న విషయాలు జరిగే రోజును తృణకీరించే ధైర్యం ఎవరికైనా ఉందా? భూమి అంతా సంచరించే యెహోవా యొక్క ఏడు కళ్లు జెరుబ్బాబెలు చేతిలోని మట్టపు గుండును చూసి సంతోషిస్తాయి.”

11 అప్పుడు నేను ఆ దూతను, “దీపస్తంభానికి కుడి ఎడమలకు ఉన్న ఈ రెండు ఒలీవచెట్లు ఏంటి?” అని అడిగాను.

12 నేను మరలా, “ఆ రెండు బంగారు గొట్టాలలో నుండి బంగారు నూనె కుమ్మరించే ఆ రెండు ఒలీవ చెట్ల కొమ్మలు ఏంటి?” అని అతన్ని అడిగాను.

13 అందుకతడు, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. “నా ప్రభువా, నాకు తెలియదు” అన్నాను.

14 అందుకతడు, “ఈ ఇద్దరూ సర్వలోక ప్రభువు దగ్గర నిలబడి సేవ చేయడానికి అభిషేకించబడ్డవారు” అని చెప్పాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ