కీర్తన 76 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 76 సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. 1 యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు; ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది. 2 షాలేములో ఆయన గుడారం ఉంది. సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది. 3 అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు, డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. సెలా 4 వేటకు ప్రసిద్ధి చెందిన పర్వతాల కంటే, మీరు గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్నారు. 5 బలవంతులు దోపిడి చేయబడ్డారు, వారు నిద్రపోయారు. ఏ ఒక్క యోధుడు మాకు వ్యతిరేకంగా చేయి ఎత్తలేడు. 6 యాకోబు దేవా! మీరు గద్దిస్తే గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి. 7 మీ ఒక్కరికే భయపడాలి. మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు? 8 పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, దేశం భయపడి మౌనం వహించింది. 9 ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి, తీర్పు తీర్చడానికి మీరు లేచారు. సెలా 10 మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు. 11 దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి; పొరుగు దేశాలన్నీ భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక. 12 పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు; భూరాజులు ఆయనను చూసి భయపడాలి. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.