Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 135 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 135

1 యెహోవాను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి; యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి,

2 యెహోవా మందిరంలో, మన దేవుని మందిర ఆవరణాల్లో సేవ చేసేవారలారా, ఆయనను స్తుతించండి.

3 యెహోవా మంచివాడు కాబట్టి యెహోవాను స్తుతించండి; ఆయన నామానికి స్తుతులు పాడండి, అది మనోహరమైనది.

4 యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.

5 యెహోవా గొప్పవాడని, దేవుళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడని నాకు తెలుసు.

6 ఆకాశాల్లో భూమిమీద, సముద్రాల్లో జలాగాధాలలో, యెహోవా తనకిష్టమైన దానిని జరిగిస్తారు.

7 ఆయన భూమి అంచుల నుండి మేఘాలను లేచేలా చేస్తారు; వర్షంతో పాటు మెరుపులను పంపిస్తారు తన కోటలో నుండి గాలిని బయటకు పంపిస్తారు.

8 ఈజిప్టులో మొదటి సంతానాన్ని ఆయన మొత్తారు, మనుష్యుల పశువుల మొదటి సంతానాన్ని ఆయన హతం చేశారు.

9 ఓ ఈజిప్టు, మీ మధ్యలో ఫరోకు, అతని సేవకులకు వ్యతిరేకంగా ఆయన ఆశ్చర్యకార్యాలను అద్భుతాలను పంపారు.

10 ఆయన అనేక జాతులను మొత్తారు బలాఢ్యులైన రాజులను హతం చేశారు.

11 అమోరీయుల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు, కనాను రాజులందరూ,

12 ఆయన వారి దేశాన్ని వారసత్వంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చారు.

13 యెహోవా, మీ నామం నిత్యం ఉంటుంది. యెహోవా, మీ కీర్తి తరతరాలులో నిలిచి ఉంటుంది.

14 యెహోవా తన ప్రజలకు శిక్ష విముక్తి జరిగిస్తారు, ఆయన సేవకులపై దయ కలిగి ఉంటారు.

15 దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.

16 వాటికి నోళ్ళున్నాయి కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి కాని చూడలేవు.

17 చెవులున్నాయి కాని వినలేవు, వాటి నోళ్లలో ఊపిరి ఏమాత్రం లేదు.

18 వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.

19 ఓ ఇశ్రాయేలు గృహమా, యెహోవాను స్తుతించు; ఓ అహరోను గృహమా, యెహోవాను స్తుతించు;

20 ఓ లేవీ గృహమా, యెహోవాను స్తుతించు; యెహోవాకు పట్ల భయము కలవారలారా, యెహోవాను స్తుతించండి.

21 సీయోనులో నుండి యెహోవా స్తుతించబడును గాక, ఆయన యెరూషలేములో నివసిస్తారు. యెహోవాను స్తుతించండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ