Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

నెహెమ్యా 6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


పునర్నిర్మాణానికి కలిగిన మరింత వ్యతిరేకత

1 అప్పటికి నేను గుమ్మాలకు తలుపులు నిలబెట్టక పోయినప్పటికి, ఏ బీటలు లేకుండా గోడను పునర్నిర్మించానని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము, మరికొందరు మా మిగతా శత్రువులు విన్నారు.

2 సన్బల్లటు గెషెము, “రండి, మనం ఓనో సమతల మైదానంలో ఉన్న ఒక గ్రామంలో కలుసుకుందాం” అని నాకు సందేశం పంపారు. అయితే వారు నాకు హాని చేయాలని కుట్రపన్నారు;

3 కాబట్టి నేను వారికి, “నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, దానిని విడిచిపెట్టి మీ దగ్గరకు ఎందుకు రావాలి? లేను రాలేను” అని చెప్పి దూతతో కబురు పంపాను.

4 వారదే పనిగా నాలుగు సార్లు కబురు పంపారు. నేను ప్రతిసారి అదే జవాబు ఇచ్చాను.

5 అప్పుడు అయిదవసారి సన్బల్లటు తన పనివాని చేతికి తెరిచి ఉన్న ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు.

6 దానిలో ఈ విధంగా వ్రాసి ఉంది: “నీవు యూదులతో కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో గోడ కడుతున్నావని ప్రజల మధ్యలో వదంతి ఉంది. దానిని గెషెము నిరూపించాడు. అంతే కాకుండా దాని ప్రకారం నీవు వారికి రాజు కావాలని చూస్తున్నావు.

7 యూదాలో రాజు ఉన్నాడని యెరూషలేములో నీ గురించి ప్రకటించడానికి నీవు ప్రవక్తలను కూడా నియమించావు. ఈ విషయాలు రాజుకు తెలుస్తాయి కాబట్టి నీవు వస్తే ఈ విషయం గురించి మనం కలిసి మాట్లాడుకోవచ్చు.”

8 అప్పుడు నేను ఈ విధంగా జవాబు పంపించాను: “నీవు చెప్పినట్లుగా ఇక్కడ ఏమి జరుగలేదు; అవన్నీ మీరు ఊహించి కల్పించినవే” అని వారికి జవాబు పంపాను.

9 “వారి చేతులు పని చేసి బలహీనమైపోయి ఇక వారు ఆ పని చేయలేరు” అని భావించి వారు మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించారు. అయితే నేను, “ఇప్పుడు నా చేతులను బలపరచు” అని ప్రార్థించాను.

10 ఒక రోజు నేను మెహేతబేలుకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా ఇంటికి వెళ్లాను. అతడు ఇంట్లోనే ఉన్నాడు. అతడు, “రాత్రివేళ నిన్ను చంపడానికి వారు వస్తున్నారు కాబట్టి మనం దేవుని మందిరం దగ్గర కలుసుకొని గర్భాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకుందాం” అని చెప్పాడు.

11 కాని నేను, “నాలాంటివాడు పారిపోవాలా? లేదా నా లాంటివాడు ప్రాణాలు కాపాడుకోడానికి గర్భాలయంలోకి వెళ్లి దాక్కోవాలా? నేను వెళ్లను” అన్నాను.

12 దేవుడు అతన్ని పంపించలేదని నేను గ్రహించాను. నాకు వ్యతిరేకంగా ప్రవచించడానికి టోబీయా సన్బల్లటు అతనికి లంచం ఇచ్చారు.

13 నేను భయపడి అతడు చెప్పినట్లు చేసి పాపం చేస్తే వారు నన్ను నిందించి నాకు చెడ్డ పేరు తీసుకురావాలని లంచమిచ్చి అతన్ని నియమించుకున్నారు.

14 నా దేవా, టోబీయా సన్బల్లటు చేసిన దానిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి; నన్ను బెదిరించడానికి ప్రయత్నించిన ఈ ప్రవక్తలను, నోవద్యా అనే ప్రవక్తిని కూడా జ్ఞాపకం చేసుకోండి.

15 ఈ విధంగా ఏలూలు నెల ఇరవై అయిదవ తేదీన అనగా యాభై రెండు రోజులకు గోడ కట్టడం పూర్తయ్యింది.


పూర్తయైన గోడ మీద వ్యతిరేకత

16 ఈ సంగతి విన్న మా శత్రువులు చుట్టుప్రక్కల దేశాలు మా దేవుని సహాయంతో పని పూర్తయ్యిందని గ్రహించి చాలా భయపడి ధైర్యం కోల్పోయారు.

17 ఆ రోజుల్లో యూదా సంస్థానాధిపతులు టోబీయాకు పదే పదే ఉత్తరాలు పంపుతూ ఉండేవారు. టోబీయా కూడా వారికి జవాబులు పంపేవాడు.

18 అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. అంతే కాకుండా అతని కుమారుడైన యెహోహనాను బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. కాబట్టి యూదా వారిలో చాలామంది అతనికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేశారు.

19 అంతేకాక వారు నా దగ్గరకు వచ్చి అతని గురించి పొగుడుతూ నేను చెప్పేవాటన్నిటిని అతనికి చేరవేసేవారు. నన్ను బెదిరించడానికే టోబీయా ఉత్తరాలు పంపేవాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ