Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

నహూము 2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


నీనెవె పతనం

1 నీనెవే! దాడి చేసేవాడు నీ మీదికి వస్తున్నాడు. కోటకు కాపలా ఉండు, రహదారి మీద నిఘా వేయి, నడుము బిగించుకో, నీ బలమంతటిని కూడగట్టుకో!

2 దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.

3 సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి; యోధులు ఎరుపు దుస్తులు ధరించారు. వారు సిద్ధపడిన రోజున రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది; సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.

4 రథాలు వీధుల్లో దూసుకెళ్తాయి, రాజమార్గాల గుండా ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతున్నాయి. అవి మండుతున్న జ్యోతుల్లా కనిపిస్తున్నాయి; అవి మెరుపులా వేగంగా వెళ్తున్నాయి.

5 నీనెవె తన అధికారులను పిలుస్తుంది, అయినా వారు తమ దారిలో తడబడతారు. వారు నగర గోడకు గుద్దుకుంటారు; రక్షణ కవచం సిద్ధం చేస్తారు.

6 నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి.

7 నీనెవెను బందీగా, తీసుకుపోవాలని శాసించబడింది. ఆమె దాసీలు పావురాల్లా మూలుగుతూ, తమ రొమ్ముల మీద కొట్టుకుంటారు.

8 నీనెవె నీరు పారుతున్న నీరు కొలనులా ఉంది. “ఆగు! ఆగు!” అని వారు ఏడుస్తారు, కానీ ఎవరూ వెనుకకు తిరుగరు.

9 వెండిని దోచుకో! బంగారాన్ని దోచుకో! ఆమె ఖజానాల్లో అంతులేని సంపదలు ఉన్నాయి!

10 ఆమె కొల్లగొట్టబడి దోచుకోబడి పాడుచేయబడుతుంది! హృదయాలు కరిగిపోతున్నాయి, మోకాళ్లు వణుకుతున్నాయి, శరీరాలు వణుకుతున్నాయి, ప్రతీ ముఖం పాలిపోతుంది.

11 సింహాల గుహ ఇప్పుడు ఎక్కడ? వాటి పిల్లల మేత స్థలం ఎక్కడ? సింహం, ఆడసింహం, సింహం కూనలు ఏ భయం లేకుండా తిరిగే చోటు ఏది?

12 సింహం తన కూనల కోసం కావలసినంత వేటాడుతూ, ఆడ సింహానికి ఆహారంగా జంతువుల మెడ కొరికి చంపుతూ, చంపిన వాటితో తన నివాస స్థలాలను, వేట మాంసంతో తన గుహలను నింపింది.

13 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు “నేను నీకు వ్యతిరేకిని, నీ రథాల నుండి పొగ వచ్చేలా కాల్చివేస్తాను, ఖడ్గం నీ కొదమ సింహాలను చంపివేస్తుంది. నేను భూమ్మీద నీకు ఏ ఎర దొరక్కుండా చేస్తాను. నీ దూతల స్వరాలు ఇక వినబడవు.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ