Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

యోనా 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యోనా యెహోవా నుండి పారిపోవుట

1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు వచ్చింది:

2 “నీవు లేచి నీనెవె మహా పట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటించు, ఎందుకంటే దాని చెడుతనం నా దృష్టిలో ఘోరంగా ఉంది.”

3 అయితే యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోదామని తర్షీషు వైపు వెళ్లాడు. అతడు యొప్పేకు వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లే ఓడను చూశాడు. అతడు డబ్బు చెల్లించి, యెహోవా నుండి పారిపోవడానికి ఓడ ఎక్కి తర్షీషుకు ప్రయాణమయ్యాడు.

4 అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది.

5 ఆ నావికులందరు భయపడ్డారు, ప్రతివాడు తన దేవునికి మొరపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అయితే యోనా ఓడ దిగువ భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రలోకి వెళ్లాడు.

6 ఓడ నాయకుడు అతని దగ్గరకు వెళ్లి, “నీవు ఎలా పడుకోగలుగుతున్నావు? లేచి నీ దేవునికి మొరపెట్టు! ఒకవేళ ఆయన మనల్ని గమనించి మనం నశించకుండా చేస్తారేమో” అని అన్నాడు.

7 అప్పుడు నావికులు, “రండి, ఎవరి మూలంగా ఈ ఆపద రాడానికి ఎవరు బాధ్యులో చీట్లు వేసి తెలుసుకుందాం” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు చీట్లు వేసినప్పుడు చీటి యోనా పేరిట వచ్చింది.

8 కాబట్టి వారు అతన్ని, “చెప్పు, ఈ కష్టం మన మీదికి రావడానికి ఎవరు బాధ్యులు? నీవు ఏ పని చేస్తావు? నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీ దేశం ఏది? నీ జనమేది?” అని అడిగారు.

9 అందుకతడు, “నేను హెబ్రీయున్ని; సముద్రాన్ని ఎండిన నేలను సృజించిన పరలోక దేవుడైన యెహోవాను ఆరాధిస్తాను” అన్నాడు.

10 దానికి వారు భయపడి అతనితో, “నీవు చేసింది ఏంటి?” అన్నారు. (అతడు యెహోవా నుండి పారిపోతున్నాడని వారికి తెలుసు, ఎందుకంటే అతడు అప్పటికే వారికి చెప్పాడు.)

11 సముద్రంలో తుఫాను మరీ తీవ్రంగా మారుతుంది. కాబట్టి వారు అతన్ని, “సముద్రం మాకోసం నిమ్మళించాలంటే మేము నీకేం చేయాలి?” అని అడిగారు.

12 అందుకు అతడు, “నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం నిమ్మళిస్తుంది. ఈ గొప్ప తుఫాను నా కారణంగానే మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు” అన్నాడు.

13 అయితే వారు ఓడను సముద్రతీరానికి చేర్చడానికి శాయశక్తులా ప్రయత్నించారు. కాని తుఫాను ఇంకా తీవ్రంగా విజృంభిస్తుంది కాబట్టి వారు ఏమి చేయలేకపోయారు.

14 అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి, “యెహోవా, ఈ మనిషి ప్రాణం కోసం దయచేసి మమ్మల్ని చావనివ్వకండి. నిర్దోషిని చంపుతున్నామని మామీద నేరం మోపకండి, ఎందుకంటే యెహోవా, మీ ఇష్ట ప్రకారం ఇలా జరిగిస్తున్నారు” అని చెప్పి,

15 వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు, వెంటనే పొంగుతూ ఉన్న సముద్రం నిమ్మళించింది.

16 అది చూసి వారంతా యెహోవాకు ఎంతో భయపడి, యెహోవాకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేశారు.


యోనా ప్రార్థన

17 యెహోవా యోనాను మ్రింగడానికి పెద్ద చేపను యెహోవా నియమించారు, యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ