Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

యోబు 40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు:

2 “సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!”

3 అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు:

4 “నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.

5 ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”

6 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:

7 “పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.

8 “నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?

9 దేవుని బాహువులాంటిది నీకుందా? ఆయన స్వరంలా నీ స్వరం ఉరుమగలదా?

10 అలాగైతే మహిమ వైభవంతో నిన్ను నీవే అలంకరించుకో! ఘనత ప్రభావాలను ధరించుకో!

11 నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు, గర్విష్ఠులందరిని చూసి వారిని పడగొట్టు,

12 గర్విష్ఠులందరిని చూసి వారిని అణచివేయి, వారున్న చోటులోనే దుష్టులను నలగ్గొట్టు.

13 వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు; వారిని సమాధిలో బంధించు.

14 అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని నేనే నీ ముందు ఒప్పుకుంటాను.

15 “నీటిగుర్రాన్ని చూడు, నిన్ను చేసినట్లే దానిని కూడా సృజించాను అది ఎద్దులా గడ్డిమేస్తుంది.

16 దాని బలం దాని నడుములో ఉంది, దాని శక్తి దాని కడుపు కండరాల్లో ఉంది!

17 దాని తోక దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు వంగుతుంది; దాని తొడనరాలు గట్టిగా అతికి ఉన్నాయి.

18 దాని ఎముకలు ఇత్తడి గొట్టాలు, దాని ప్రక్కటెముకలు ఇనుప కడ్డీల్లాంటివి.

19 దేవుని కార్యాల్లో అది మొదటి స్థానంలో ఉంటుంది, అయినా దాని సృష్టికర్తే దానిని తన ఖడ్గంతో సమీపించగలడు.

20 కొండలు దానికి ఆహారం అందిస్తాయి, అడవి జంతువులన్నీ దగ్గరలోనే ఆడుకుంటాయి.

21 తామర మొక్కల క్రింద అది పడుకుంటుంది, బురదనేలలోని రెల్లు మధ్యలో అది దాక్కుంటుంది.

22 తామరచెట్లు వాటి నీడలో దానిని కప్పుతాయి; కాలువలోని నిరవంజి చెట్లు దానిని చుట్టుకొని ఉంటాయి.

23 నది పొంగిపొర్లినా అది భయపడదు. యొర్దాను నది పొంగి దాని నోటి వరకు నీరు వచ్చినా అది ధైర్యంగా ఉంటుంది.

24 అది మెలకువగా ఉన్నప్పుడు ఎవరైనా దానిని బంధించగలరా, దానికి వలవేసి ముక్కుకు తాడువేయగలరా?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ