Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

యోబు 38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యెహోవా మాట్లాడడం

1 అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:

2 “తెలివిలేని మాటలతో నా ప్రణాళికలను వక్రీకరిస్తున్న ఇతడెవడు?

3 పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.

4 “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.

5 దాని కొలమానాన్ని ఎవరు నిర్ణయించారు? నీకు ఖచ్చితంగా తెలుసు! దాని చుట్టూ కొలత రేఖను వేసిందెవరు?

6-7 వేకువ చుక్కలన్ని కలిసి గానం చేస్తుంటే దేవదూతలంతా ఆనంద కేకలు వేస్తుంటే దాని పాదాలు దేనిపై మోపబడ్డాయి? దానికి మూలరాయి వేసింది ఎవరు?

8 “భూగర్భం నుండి సముద్రం పొంగి వచ్చినప్పుడు తలుపుల వెనుక దానిని మూసి ఉంచింది ఎవరు?

9 నేను మేఘాలను దానికి వస్త్రంగా చేసి కటిక చీకటిలో దానిని చుట్టిపెట్టినప్పుడు,

10 నేను దానికి హద్దులను నిర్ణయించి తలుపులు గడియలు అమర్చినప్పుడు,

11 ఇక్కడి వరకు నీవు రావచ్చు ఇంతకు మించి కాదు; నీ అహంకార అలలు ఇక్కడే ఆగిపోవాలి,

12-13 “భూమి అంచుల వరకు వ్యాపించి దానిలో నుండి దుష్టులను దులిపివేసేలా నీవెపుడైనా ఉదయాన్ని ఆజ్ఞాపించావా? తెల్లవారుజాముకు దాని స్థలమేదో ఎప్పుడైనా తెలియచేశావా?

14 ముద్ర వేయబడిన బంకమట్టిలా భూమి రూపం మారుతుంది; దాని లక్షణాలు వస్త్రం యొక్క లక్షణాల్లా ఉంటాయి.

15 దుర్మార్గుల దగ్గర నుండి వారి వెలుగు తొలగించబడింది, పైకెత్తబడిన వారి చేయి విరగ్గొట్టబడింది.

16 “నీవెప్పుడైనా సముద్రపు ఊటలలోనికి ప్రవేశించావా? సముద్రపు అడుగుభాగంలో నడిచావా?

17 మృత్యుద్వారాలు నీకు చూపించబడ్డాయా? లోతైన చీకటి ద్వారాలను నీవు చూశావా?

18 భూమి వైశాల్యం ఎంతో నీకు గ్రహించగలవా? ఒకవేళ ఇవన్నీ నీకు తెలిస్తే, నాకు చెప్పు.

19 “వెలుగు నివసించే చోటికి వెళ్లే మార్గం ఏది? చీకటి ఎక్కడ నివసిస్తుంది?

20 దానిని దాని చోటికి నీవు తీసుకెళ్లగలవా? దాని నివాస స్థలాలకు మార్గం నీవు వివేచించగలవా?

21 నీకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే అప్పటికే నీవు పుట్టావు! నీవు అనేక సంవత్సరాలు జీవించావు!

22 “మంచు నిల్వ ఉండే స్థలాలకు నీవు వెళ్లవా? వడగండ్లు నిల్వ ఉండే స్థలాలను నీవు చూశావా?

23 వాటిని నేను కష్టకాలం కోసం, యుద్ధం కోసం యుద్ధ దినాల కోసం దాచిపెట్టాను.

24 వెలుగు విభజించబడే చోటుకు మార్గం ఏది? తూర్పుగాలులు ఎక్కడ నుండి వచ్చి భూమంతటా వ్యాపిస్తాయి?

25-27 ఎవరూ నివసించని భూమికి, మనుష్యులే నివసించని ఎడారికి నీరు పెట్టడానికి, పాడైపోయిన బీడుభూమిని తృప్తిపరచి అందులో లేతగడ్డి మొక్కలను ఎవరు మొలిపిస్తున్నారు? కుండపోతగా కురిసే వర్షానికి ఎవరు కాలువలు ఏర్పాటు చేశారు? ఉరుములు మెరుపులకు ఎవరు మార్గమేర్పరిచారు?

28 వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను ఎవరు పుట్టిస్తారు?

29 ఎవరి గర్భం నుండి మంచుగడ్డ వచ్చింది? పైనుండి దిగివచ్చే మంచును ఎవరు పుట్టించారు?

30 నీళ్లు రాయిలా ఎప్పుడు గడ్డకట్టుకుపోతాయి, లోతైన నీళ్ల ఉపరితలం ఎప్పుడు గట్టిపడుతుంది?

31 “కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో బంధించగలవా? మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా?

32 నక్షత్ర రాశులను వాటి వాటి కాలాల్లో వచ్చేలా నీవు చేయగలవా? సప్తరుషి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా?

33 ఆకాశం యొక్క చట్టాలు నీకు తెలుసా? నీవు భూమిపై దేవుని ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయగలవా?

34 “నిన్ను నీటి వరదతో కప్పి వేయమని నీ స్వరాన్ని ఎత్తి నీవు మేఘాలకు చెప్పగలవా?

35 నీవు మెరుపులను వాటి మార్గాల్లో పంపుతావా? మేము ఇక్కడ ఉన్నాము అని అవి నీతో చెప్తాయా?

36 హృదయానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? మనస్సుకు వివేచన కలిగించింది ఎవరు?

37-38 దుమ్ము గట్టిగా మారినప్పుడు మట్టిగడ్డలు ఒకదాన్ని ఒకటి అతుక్కున్నప్పుడు మేఘాలను లెక్కించు జ్ఞానం ఎవరికుంది? ఆకాశపు నీటి పాత్రలను బోర్లించగలరు?

39-40 “సింహపుపిల్లలు గుహలో పడుకుని ఉన్నప్పుడు, అవి పొదలో పొంచి ఉన్నప్పుడు, ఆడసింహం కోసం నీవు ఎరను వేటాడి వాటి ఆకలిని తీర్చగలవా?

41 కాకిపిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక తిరుగుతున్నప్పుడు కాకికి ఆహారం ఇచ్చేది ఎవరు?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ