యోబు 28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంవిరామం: జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది 1 వెండికి గని ఉన్నది బంగారాన్ని పుటం వేయడానికి ఒక స్థలం ఉన్నది. 2 ఇనుము మట్టిలో నుండి తీయబడుతుంది, ధాతువు కరిగించి రాగి తీస్తారు. 3 చీకటిలో కాంతిని ఎలా ప్రకాశింప చేయాలో మానవులకు తెలుసు; ధాతువు కోసం చీకటిలో శోధిస్తున్నప్పుడు భూమి యొక్క సుదూర ప్రాంతాలను అన్వేషిస్తారు. 4 మనుష్యుల నివాస స్థలాలకు దూరంగా, మానవ అడుగులు పడని చోట్లలో; వ్రేలాడుతూ ఊగుతూ సొరంగాలు త్రవ్వుతారు. 5 భూమిపై ఆహారం పెంచబడుతుంది, కాని దాని లోపలి భాగం అగ్నికి కరిగిపోయి ఉంటుంది. 6 దాని రాళ్లల్లో నీలమణులుంటాయి. దాని మట్టిలో బంగారం ఉంటుంది. 7 దాని త్రోవ ఏ గ్రద్దకు తెలియదు, డేగ కన్ను కూడా దానిని చూడలేదు. 8 గర్వంగల క్రూరమృగాలు ఆ దారిలో అడుగుపెట్టలేదు, ఏ సింహం అక్కడ నడవలేదు. 9 మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు. కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు. 10 బండలో వారు సొరంగం త్రవ్వుతారు. దాని నిధులను వారి కళ్లు పసిగడుతుంది. 11 వారు నదుల మూలాలను శోధిస్తారు, మరుగున పడి ఉన్నవాటిని వెలుగులోనికి తెస్తారు. 12 అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? అవగాహన ఎక్కడ నివసిస్తుంది? 13 ఏ మానవుడు దాని విలువను అర్థం చేసుకోడు; అది సజీవుల దేశంలో దొరకదు. 14 “అది నాలో లేదు” అని అగాధం అంటుంది; “అది నాలో లేదు” అని సముద్రం అంటుంది. 15 మేలిమి బంగారంతో దానిని కొనలేము, దాని వెలకు సరిపడా వెండిని తూచలేము. 16 ఓఫీరు బంగారంతోనైనా విలువైన గోమేధికంతోనైనా నీలమణితోనైనా దానిని కొనలేము. 17 బంగారాన్ని కాని స్ఫటికాన్ని కాని దానితో పోల్చలేము; బంగారు ఆభరణాలతో కూడా దాన్ని పొందలేము. 18 పగడము చంద్రకాంత శిల ప్రస్తావించదగినవి కావు; జ్ఞానం యొక్క ధర మాణిక్యాలకు మించినది. 19 కూషుదేశపు విలువైన రాయిని దానితో పోల్చలేము; శుద్ధమైన బంగారంతో కూడా దానిని కొనలేము. 20 అలాగైతే జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? అవగాహన ఎక్కడ నివసిస్తుంది? 21 అది జీవులన్నిటి కళ్ళ నుండి దాచబడింది, ఆకాశపక్షుల నుండి కూడా అది దాచిపెట్టబడింది. 22 “కేవలం దాని గురించిన వదంతిని విన్నాము” నరకము మృత్యువు అంటాయి. 23 దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తారు అది ఎక్కడుండేది ఆయనకే తెలుసు. 24 ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు. 25 ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు జలములను కొలిచినప్పుడు, 26 వర్షపాతానికి శాసనాన్ని విధించినప్పుడు ఉరుములతో కూడిన మెరుపులకు దారిని ఏర్పరచినప్పుడు, 27 అప్పుడు ఆయన జ్ఞానం వైపు చూశాడు దానిని అంచనా వేశాడు; ఆయన దానిని ధృవీకరించారు పరీక్షించారు. 28 అంతేకాక మనుష్యజాతితో, “యెహోవాకు భయపడడమే జ్ఞానం దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.