Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

యోబు 16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యోబు

1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:

2 నేను ఇలాంటి విషయాలెన్నో విన్నాను; మీరందరు నీచంగా ఓదార్చేవారు.

3 మీ గాలిమాటలకు అంతం లేదా? మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది?

4 నేనున్న స్థానంలో మీరు ఉంటే, నేనూ మీలాగే మాట్లాడగలను; మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడి మిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను.

5 కాని నా నోటి మాట మిమ్మల్ని బలపరుస్తుంది; నా పెదవుల నుండి వచ్చే ఆదరణ మీకు ఉపశమనం కలిగిస్తుంది.

6 అయితే నేను మాట్లాడినప్పటికి నా బాధకు ఉపశమనం లేదు; మౌనంగా ఉన్నా నా బాధ తీరదు.

7 దేవా, నాకు అలసట కలిగించారు; నా కుటుంబమంతటిని వినాశనం చేశారు.

8 మీరు నన్ను అస్థిపంజరంలా చేశారు అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది; బక్కచిక్కిన నా దేహం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది.

9 దేవుడు తన కోపంలో నా మీద దాడి చేసి నన్ను చీల్చివేశారు; ఆయన నా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నారు; నాకు శత్రువై నాపై కన్నెర్ర చేసి నావైపు కోపంగా చూస్తున్నారు.

10 ప్రజలు నన్ను ఎత్తిపొడవడానికి వారి నోళ్ళు తెరిచారు; నన్ను తిట్టి చెంపదెబ్బలు కొడుతున్నారు. నాకు వ్యతిరేకంగా వారంతా ఒక్కటైయ్యారు.

11 దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు. దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు.

12 నేను నెమ్మది కలిగి ఉండేవాన్ని, కాని ఆయన నన్ను ముక్కలుగా చేశారు; నా మెడ పట్టుకుని విదిలించి నన్ను నలిపేశారు. ఆయన నన్ను తన గురిగా పెట్టుకున్నారు;

13 ఆయన బాణాలు నన్ను చుట్టుకున్నాయి జాలి లేకుండ ఆయన నా మూత్రపిండాల గుండా గుచ్చారు నా పైత్యరసాన్ని నేలపై పారబోశారు.

14 పదే పదే ఆయన నన్ను విరుచుకుపడ్డారు; శూరునిలా పరుగున నా మీద పడ్డారు.

15 నా చర్మం మీద గోనెపట్ట కుట్టుకున్నాను నా నుదిటిని దుమ్ములో ఉంచాను.

16 ఏడ్పుచేత నా ముఖం ఎరుపెక్కింది నా కనురెప్పల మీద చీకటి నీడలు ఉన్నాయి;

17 అయినా నా చేతులు దౌర్జన్యానికి దూరంగా ఉన్నాయి, నా ప్రార్థనలు యథార్థంగా ఉన్నాయి.

18 భూమీ, నా రక్తాన్ని కప్పివేయకు; నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి.

19 ఇప్పుడు కూడా నా సాక్షి పరలోకంలో ఉన్నాడు; నా న్యాయవాది పైన ఉన్నాడు.

20 నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా నా మధ్యవర్తి నా స్నేహితుడు

21 ఒకడు స్నేహితుని కోసం వేడుకున్నట్లు అతడు నరుని పక్షాన దేవున్ని వేడుకుంటాడు.

22 ముందున్నవి ఇంకా కొన్ని సంవత్సరాలే తర్వాత నేను తిరిగి రాలేని మార్గంలో వెళ్తాను.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ