Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

హోషేయ 11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


ఇశ్రాయేలుపై దేవుని ప్రేమ

1 “ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను, ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను.

2 అయితే ఎంత ఎక్కువగా వారిని పిలిస్తే, అంతగా వారు నా నుండి దూరమయ్యారు. వారు బయలుకు బలులు అర్పించారు, విగ్రహాలకు ధూపం వేశారు.

3 ఎఫ్రాయిం ప్రజలను చేయి పట్టుకుని, నడవడం నేర్పింది నేనే; అయితే వారిని స్వస్థపరచింది నేనని వారు గ్రహించలేదు.

4 నేను మనుష్యుల మంచితనం అనే త్రాళ్లతో, ప్రేమ బంధాలతో వారిని నడిపించాను. ఒకడు చిన్నబిడ్డను ముఖం దగ్గరకు ఎలా తీసుకుంటారో, అలా నేను వారికి ఉంటూ వారి మీద నుండి కాడిని తీసివేశాను, నేను క్రిందికి వంగి వారిని పోషించాను.

5 “వారు ఈజిప్టుకు తిరిగి వెళ్లరా? అష్షూరు రాజు వారిమీద అధికారం చేయడా? ఎందుకంటే వారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.

6 వారి పట్టణాల్లో ఖడ్గం తళుక్కుమంటుంది; అది వారి అబద్ధ ప్రవక్తలను మ్రింగివేస్తుంది, వారి ఉపాయాలను తుదముట్టిస్తుంది.

7 నా ప్రజలు నా నుండి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నారు. వారు మహోన్నత దేవుడనైన నాకు మొరపెట్టినా, నేను ఏ విధంగాను వారిని హెచ్చించను.

8 “ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను? ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను? నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను? సెబోయిములా నిన్ను ఎలా చేయగలను? నా హృదయం నాలో మారింది; నా జాలి అంతా ఉప్పొంగుతుంది.

9 నేను నా కోపాగ్నిని చూపించను, ఎఫ్రాయిమును మరలా నాశనం చేయను. నేను దేవుడను, మనిషిని కాను, మీ మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడను. నేను వారి పట్టణాలకు విరుద్ధంగా రాను.

10 వారు యెహోవాను అనుసరిస్తారు; ఆయన సింహంలా గర్జిస్తారు, ఆయన గర్జించినప్పుడు, ఆయన పిల్లలు పడమటి నుండి వణకుతూ వస్తారు.

11 వారు వణకుతూ ఈజిప్టు నుండి పక్షుల్లా ఎగిరి వస్తారు, అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు. వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


ఇశ్రాయేలీయుల పాపం

12 ఎఫ్రాయిం అబద్ధాలతో నన్ను చుట్టుముట్టింది, ఇశ్రాయేలు మోసంతో నన్ను ఆవరించింది. యూదా దేవునికి విరుద్ధంగా ఉంది, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ