హెబ్రీయులకు 8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంయేసు మన ప్రధాన యాజకుడు 1 మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగి ఉన్నాం, 2 ఆయన మానవుని చేత కాక దేవుని చేత తయారుచేయబడిన నిజమైన ప్రత్యక్షగుడారంలో అతిపరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు. 3 ప్రతి ప్రధాన యాజకుడు దేవునికి కానుకలను బలులను అర్పించడానికి నియమించబడి ఉన్నాడు కాబట్టి ఈయన కూడ దేవునికి ఏదైనా సమర్పించాల్సిన అవసరం ఉండింది. 4 ఆయన భూమి మీద ఉండి ఉంటే, ఒక యాజకుడై ఉండేవాడు కాడు, ధర్మశాస్త్రంలో వ్రాసి ఉన్న ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఇప్పటికే ఉన్నారు. 5 పరలోకంలో ఉన్న దానికి కేవలం ఒక నమూనాగా ఛాయాచిత్రంగా ఉన్న పరిశుద్ధ స్థలంలో యాజకులుగా వారు సేవ చేస్తారు. ఇందుకే మోషే గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు దాన్ని గురించి ఇలా హెచ్చరిక పొందాడు: “పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే ప్రతిదీ చేసేలా చూడాలి.” 6 అయితే నిజానికి నూతన నిబంధన మరింత గొప్ప వాగ్దానాలపై స్థాపించబడింది కాబట్టి, యేసు మధ్యవర్తిగా ఉన్న ఈ నిబంధన గత నిబంధన కన్న శ్రేష్ఠమైనదైనట్లే ఆయనకు అప్పగించబడిన పరిచర్య కూడా శ్రేష్ఠమైనదే. 7 అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు. 8 అయితే దేవుడు ప్రజల్లో దోషాన్ని కనుగొని ఇలా చెప్పారు: “ప్రభువు ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజులు వస్తున్నాయి, అప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ క్రొత్త నిబంధన చేస్తాను. 9 ఆ నిబంధన, ఈజిప్టు దేశం నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకొని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే వారు నా నిబంధనకు నమ్మకంగా నిలబడలేదు, అందుకే నేను వారి నుండి దూరమయ్యాను, అని ప్రభువు చెప్తున్నారు. 10 ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను స్థాపించే నిబంధన ఇదే అని ప్రభువు ప్రకటిస్తున్నారు. వారి మనస్సులో నా న్యాయవిధులను ఉంచుతాను వారి హృదయాల మీద వాటిని వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. 11 ఇకపై వారిలో ఎవ్వరూ తమ పొరుగువారికి బోధించరు, ‘ప్రభువును తెలుసుకోండి’ అని ఒకరికొకరు చెప్పుకోరు, ఎందుకంటే వారిలో సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకు అందరు నన్ను తెలుసుకుంటారు. 12 ఎందుకంటే నేను దయతో వారి దుష్టత్వాన్ని క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడు జ్ఞాపకం చేసుకోను.” 13 ఆయన ఈ నిబంధనను, “క్రొత్త” అని పిలువడం చేత మొదటి దాన్ని వాడుకలో లేకుండ చేశారు; వాడుకలో లేనివి పాతవి త్వరలో అదృశ్యమవుతాయి. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.