హబక్కూకు 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఇది ప్రవక్తయైన హబక్కూకు ఒక దర్శనంలో పొందుకున్న ప్రవచనము. హబక్కూకు ఫిర్యాదు 2 యెహోవా, సహాయం కోసం నేను మొరపెట్టినా, ఎంతకాలం వినకుండా ఉంటావు? “హింస!” జరుగుతుందని నీకు మొరపెట్టినా ఎంతకాలం రక్షించకుండ ఉంటావు? 3 నన్నెందుకు దుష్టత్వాన్ని చూసేలా చేస్తున్నావు? తప్పు చేయడాన్ని నీవెందుకు సహిస్తున్నావు? నాశనం హింస నా ముందే ఉన్నాయి; కలహాలు ఘర్షణలు చెలరేగుతున్నాయి. 4 అందుకే ధర్మశాస్త్రం కుంటుపడింది, ఎప్పుడూ న్యాయం జరగడం లేదు. దుర్మార్గులు నీతిమంతులను చుట్టుముడుతున్నారు, న్యాయం చెడిపోతుంది. యెహోవా జవాబు 5 “దేశాల వైపు గమనించి చూసి, నిర్ఘాంతపోయి ఆశ్చర్యపడండి: ఎందుకంటే మీ కాలంలో నేనొక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి ఎవరైనా మీకు చెప్పినా మీరు దాన్ని నమ్మరు. 6 తమవి కాని నివాస స్థలాలను ఆక్రమించుకోడానికి, భూమి అంచుల వరకు తిరిగే క్రూరులును, ఆవేశపరులునైన బబులోను ప్రజలను నేను రేపుతున్నాను. 7 వారు అత్యంత భయంకరమైన ప్రజలు; వారు తమకు ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేసుకుని అధికారం చెలాయిస్తారు. 8 వారి గుర్రాలు చిరుతపులి కంటే వేగవంతమైనవి, చీకట్లలో తిరిగే తోడేళ్ళ కంటే భయంకరమైనవి. వారి గుర్రాల దండు దూకుడుగా చొరబడతాయి; వారి రౌతులు దూరం నుండి వస్తారు. ఎరను పట్టుకోవడానికి గ్రద్ద వచ్చినట్లుగా వారు వేగంగా వస్తారు; 9 వారంతా దౌర్జన్యం చేయడానికి వస్తారు. ఎడారి గాలిలా వారి ముఖాలను పైకెత్తి ఇసుకరేణువులంత విస్తారంగా ప్రజలను బందీలుగా పట్టుకుంటారు. 10 వారు రాజులను వెక్కిరిస్తారు పాలకులను ఎగతాళి చేస్తారు. కోటలున్న పట్టణాలను చూసి నవ్వుతారు; మట్టి దిబ్బలు వేసి వాటిని స్వాధీనపరచుకుంటారు. 11 గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతూ అపరాధులవుతారు, తమ బలాన్నే తమ దేవునిగా భావిస్తారు.” హబక్కూకు రెండవ ఫిర్యాదు 12 యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా? నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు. యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు; నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు. 13 నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి; నీవు తప్పును సహించలేవు. మరి ద్రోహులను ఎందుకు సహిస్తున్నావు? దుర్మార్గులు తమకంటే నీతిమంతులైన వారిని నాశనం చేస్తుంటే నీవెందుకు మౌనంగా ఉన్నావు? 14 పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు. 15 చెడ్డ శత్రువు వారందరిని గాలంతో పైకి లాగి, తన వలలో వారిని పట్టుకుంటాడు, తన ఉచ్చులో వారిని పోగుచేసుకుని సంతోషంతో గంతులు వేస్తాడు. 16 తన వల వలన విలాసవంతమైన జీవితం మంచి ఆహారం దొరుకుతుందని తన వలకు బలులు అర్పించి తన ఉచ్చుకు ధూపం వేస్తాడు. 17 అతడు కనికరం లేకుండా దేశాలను నాశనం చేస్తూ, నిత్యం తన వలను ఖాళీ చేస్తూనే ఉంటాడా? |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.