Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

ద్వితీ 8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యెహోవాను మరచిపోకండి

1 మీరు జీవించి అభివృద్ధిచెంది, యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకునేలా, ఈ రోజు నేను మీకిచ్చే ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా అనుసరించాలి.

2 మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో అని మిమ్మల్ని పరీక్షించి మీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి మిమ్మల్ని దీనులుగా చేయడానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో ఈ నలభై సంవత్సరాలు ఎలా నడిపించారో జ్ఞాపకం చేసుకోండి.

3 మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు కాని యెహోవా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని మీకు నేర్పించడానికి ఆయన మిమ్మల్ని అణచి మీకు ఆకలి కలిగించి మీకు గాని మీ పూర్వికులకు గాని ఇంతకుముందు తెలియని మన్నాతో మిమ్మల్ని పోషించారు.

4 ఈ నలభై సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడలేదు, మీ కాళ్లు వాయలేదు.

5 ఒకరు తన కుమారుని ఎలా క్రమశిక్షణలో పెడతారో, అలాగే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని మీ హృదయంలో మీరు గ్రహించాలి.

6 మీరు మీ దేవుడైన యెహోవాయందు భయం కలిగి, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటించాలి.

7 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మంచి దేశంలోకి తీసుకెళ్తారు; అది నదులు నీటిప్రవాహాలు లోయల నుండి కొండల నుండి ఉబికే లోతైన నీటి ఊటలు ఉండే దేశం;

8 అంతేకాదు గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూర చెట్లు దానిమ్మపండ్లు ఒలీవనూనె తేనె దొరికే దేశం;

9 ఆ దేశంలో రొట్టెలకు కొరత ఉండదు మీకు ఏది తక్కువకాదు; ఇనుప రాళ్లు గల దేశం, దాని కొండల్లో మీరు రాగి త్రవ్వితీయవచ్చు.

10 మీరు తిని తృప్తి చెందిన తర్వాత, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

11 ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆయన ఆజ్ఞలను, చట్టాలను శాసనాలను పాటించడంలో విఫలమై మీ దేవుడనైన యెహోవాను మరచిపోకుండ జాగ్రత్తపడండి.

12 లేకపోతే మీరు తిని తృప్తి చెందినప్పుడు, మీరు మంచి ఇళ్ళు కట్టుకుని వాటిలో స్థిరపడినప్పుడు,

13 మీ పశువుల మందలు విస్తరించి, వెండి బంగారాలు విస్తరించి, మీకు ఉన్నదంతా వృద్ధి చెందినప్పుడు,

14 మీ హృదయం గర్వించి, బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను మరచిపోతారు.

15 ఆయన మిమ్మల్ని విషసర్పాలు, తేళ్లు ఉన్న నీళ్లు లేని భయంకరమైన పెద్ద అరణ్యంలో నుండి నడిపించారు. రాతి బండ నుండి మీకు నీళ్లు ఇచ్చారు.

16 ఆయన అరణ్యంలో మీ పూర్వికులకు ఎన్నడూ తెలియని మన్నాను మీకు తినడానికి ఇచ్చారు, మిమ్మల్ని తగ్గించడానికి మిమ్మల్ని పరీక్షించడానికి మీ మంచి కోసం ఇచ్చారు.

17 “నా శక్తి, నా చేతుల బలం ఈ సంపదను నాకు సంపాదించాయి” అని మీలో మీరు అనుకోవచ్చు.

18 కాని, మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు, తన నిబంధన ఈ రోజు ఉన్నట్లుగా స్థిరపరచడానికి మీరు సంపదను సంపాదించే సామర్థ్యం ఇచ్చేవారు ఆయనే.

19 మీరు మీ దేవుడనైన యెహోవాను మరచిపోయి, ఇతర దేవుళ్ళను వెంబడించి పూజించి వాటిని సేవిస్తే, మీరు ఖచ్చితంగా నశించిపోతారని మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నాను.

20 మీ దేవుడైన యెహోవాకు లోబడకపోతే, మీ ఎదుట ఉండకుండా యెహోవా నాశనం చేసిన దేశాల్లా మీరు నాశనమవుతారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ