Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

1 దిన 10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


సౌలు తన ప్రాణాన్ని తీసికొనుట

1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు; వారి ఎదుట నుండి ఇశ్రాయేలీయులు పారిపోయారు, చాలామంది గిల్బోవ పర్వతం మీద చచ్చి పడిపోయారు.

2 ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి అతని కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మల్కీ-షూవలను చంపేశారు.

3 సౌలు చుట్టూ యుద్ధం తీవ్రమయ్యింది, బాణాలు వేసేవారు అతన్ని చూసి అతన్ని గాయపరిచారు.

4 సౌలు తన ఆయుధాలు మోసేవానితో, “నీ కత్తి దూసి నన్ను పొడవు, లేకపోతే సున్నతిలేని వీరు వచ్చి నన్ను దూషిస్తారు” అని అన్నాడు. కాని ఆ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి దానికి ఒప్పుకోలేదు; కాబట్టి సౌలు తన కత్తి తీసుకుని దాని మీద పడ్డాడు.

5 ఆయుధాలు మోసేవాడు సౌలు చనిపోయాడని చూసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు.

6 సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని ఇంటివారందరు ఒకేసారి చనిపోయారు.

7 సైన్యం పారిపోయిందని, సౌలు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇశ్రాయేలీయులందరు తెలుసుకున్నప్పుడు, వారు తమ పట్టణాలను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు.

8 మరుసటిరోజు చనిపోయినవారిని దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, వారు గిల్బోవ పర్వతం మీద పడి ఉన్న సౌలును, అతని కుమారులను చూశారు.

9 వారు అతన్ని దోచుకుని అతని తలను, అతని ఆయుధాలను తీసుకెళ్లి, తమ విగ్రహాల మధ్య, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నలుదిక్కులకు దూతలను పంపారు.

10 వారు అతని ఆయుధాలను తమ దేవుళ్ళ గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో వ్రేలాడదీశారు.

11 ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు,

12 వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు.

13 యెహోవాకు నమ్మకద్రోహిగా ఉన్నందుకు సౌలు చనిపోయాడు; అతడు యెహోవా వాక్కును పాటించకుండా సలహా కోసం ఆత్మలతో మాట్లాడేవారి దగ్గరకు వెళ్లాడు.

14 యెహోవా దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ