అయితే, నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, ‘యెహోవా తన ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు. పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు. భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకొంటున్నాడు’ అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం చేయకు.
నీ ప్రజలను నీవు శిక్షిస్తే “యెహోవా తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన వారిని తీసుకొని వెళ్లలేకపోయాడు, ఆయన వాళ్లను ద్వేషించాడు, కనుక వాళ్లను చంపివేయడానికి అరణ్యంలోనికి తీసుకు వెళ్లాడు” అని ఈజిప్టువాళ్లు అంటారేమో.
అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యొర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యొర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది.
కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?”