ఎజ్రా, మీ దేవుని యొద్ద నుంచి నీవు పొందిన వివేకాన్ని వినియోగించి పౌర, మతపర న్యాయాధిపతులను ఎంపికచేసే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి వారు తెలియని వారికి నేర్పాలి.