13 పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.
సొలొమోను నన్ననుసరించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలిచాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత అష్తారోతును, మోయాబీయుల దేవత కెమోషును, అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కుతున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుసరించటం సొలొమోను మానివేశాడు. నా న్యాయసూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట లేదు.
కెమోషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. కెమోషు మోయాబీయుల ఒక ఘోరమైన దేవత విగ్రహం. యెరూషలేముకు తూర్పుదిశలో ఒక కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. మొలెకు అమ్మోనీయులకు చెందిన ఒక భయానక దేవత విగ్రహం.
అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.
అమజ్యా పట్ల యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా అమజ్యా వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “అమజ్యా, ఆ ప్రజలు పూజించిన దేవుళ్లను నీవెందుకు కొలుస్తున్నావు? ఆ దేవుళ్లు వారి ప్రజలనే నీనుండి కాపాడలేక పోయారు!”
మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజాస్థలాలకు వెళ్తారు. ప్రజలు ప్రార్థించాలని ప్రయత్నిస్తారు. కానీ సంభవించిన సంగతులన్నీ వారు చూస్తారు, ప్రార్థించలేనంత బలహీనులవుతారు.”
ఆ సమయంలో ప్రజలు వారి వెండి, బంగారు విగ్రహాలను పారవేస్తారు. (ప్రజలు పూజించుటకు మనుష్యులే ఆ విగ్రహాలను తయారు చేశారు.) ప్రజలు ఆ విగ్రహాలను నేలమీది కన్నాలలో ఉండే ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు.
“ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు.
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. “కాని మిమ్మల్ని మీ జాడీలలో నుంచి బయట పోయుటకు అతి త్వరలోనే నేను మనుష్యులను పంపుతాను. ఆ మనుష్యులు మోయాబు యొక్క జాడీలను ఖాళీ చేస్తారు. తరువాత ఆ జాడీలను వారు పగులగొడతారు.”
“మోయాబు విచ్ఛిన్నమవటంతో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”
“మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు. కావున మీరు పట్టుబడతారు. కెమోషు దైవం బందీగా కొనిపోబడతాడు. అతనితో పాటు అతని యాజకులు, అధికారులు కూడ తీసికొని పోబడతారు.