పిమ్మట అక్కడ చేరిన ప్రజలంతా వినేలా హనన్యా ఇలా బిగ్గరగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చినదేమంటే, ఇదే రీతిని బబులోను రాజు నెబుకద్నెజరు వేసిన కాడిని నేను విరిచి వేస్తాను. అతడు ఆ కాడిని ప్రపంచ దేశాలన్నిటిపై వేశాడు. కాని రెండు సంవత్సరాల కాలంలోపల నేనా కాడిని విరిచివేస్తాను.” హనన్యా అలా చెప్పిన పిమ్మట యిర్మీయా దేవాలయం నుండి వెళ్లి పోయాడు.
నేను యెహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేస్తాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!
యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా లంచాలు తీసుకుంటారు. వారలా చేసి న్యాయస్థానంలో తమ తీర్పు ఇస్తారు. ప్రజలకు బోధించేముందు యెరూషలేము యాజకులకు వేతనం చెల్లించాలి. ప్రవక్తలు భవిష్యత్తులోకి చూసేముందు ప్రజలు వారికి డబ్బు చెల్లించాలి. అప్పుడా నాయకులు, “మనకు ఏరకమైన కీడూ రాదు! యెహోవా మనపట్ల ఉన్నాడు!” అని అంటారు.