పస్కా పండుగ పూర్తి అయ్యింది. యెరూషలేముకు పండుగ నిమిత్తం వచ్చిన ఇశ్రాయేలీయులు యూదాలో వున్న పట్టణాలకు వెళ్లి, అక్కడ వున్న రాతి విగ్రహాలన్నిటినీ ముక్కలు చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వారు ఈ రాతి విగ్రహాలను ఉపయోగించేవారు. ప్రజలు అషేరా స్తంభాలను కూడా నరికివేశారు. యూదా, బెన్యామీను రాజ్యాలలో వున్న ఉన్నత స్థలాలను, బలిపీఠాలను కూలదోశారు. ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో కూడా ఈ ప్రజలు అదే పని చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వినియోగించే వస్తువులన్నీ నాశనమయ్యే వరకు ప్రజలీపని చేస్తూనే వున్నారు. తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాలకు వెళ్లిపోయారు. ప్రతి వ్యక్తీ తన ఇంటికి వెళ్లిపోయాడు.