ఆ ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, బెన్యామీను జాతీయులకు విరోధులు. చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న ఆ శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్పడనివ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం నిమిత్తం మేమూ అర్థిస్తాము. అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచీ మేము మీ దేవునికే బలులు సమర్పించాము” అన్నారు.