అవి యూదులు తమ శత్రువులను నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుగ దినాలుగా జరుపుకోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను ఆనందం వెల్లివిరిసే పండుగ దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవాలి, పేదలకు కానుకలివ్వాలి.