నేనొక యాజకుణ్ణి. నా పేరు యెహెజ్కేలు. బూజీ కుమారుణ్ణి. దేశభ్రష్టుడనై చెరలో ఉన్నాను. బబులోనులో నేను కెబారు కాలువ ప్రక్కన ఉండగా ఆకాశం తెరువబడింది. అప్పుడు నాకు దైవసంబంధమైన దర్శనాలు కలిగాయి. అది ముఫ్పైయవ సంవత్సరంలో నాల్గవ నెల (జూన్) ఐదవ రోజున జరిగింది. రాజైన యెహోయాకీను ప్రవాసంలో చెరపట్టబడ్డాక ఐదవ సంవత్సరం, ఆ నెలలో ఐదవ రోజున యెహోవా వాక్కు యెహెజ్కేలుకు వినవచ్చింది. ఆ స్థలంలో యెహోవా ప్రభావం అతని మీదికి వచ్చింది.