తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!”
దేవుడు మనిషికాడు, ఆయన అబద్ధం చెప్పడు. దేవుడు మానవ కుమారుడు కాడు, ఆయన నిర్ణయాలు మారవు. ఏదైనా చేస్తానని యెహోవా చెబితే ఆయన అలానే చేస్తాడు. యెహోవా ఒక వాగ్దానం చేస్తే, ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.
ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే, నేను విశ్వసించినవాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించినదాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.