ఏడు రోజులు పూర్తిగా గడవక ముందే ఆసియ ప్రాంతంనుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూసారు. వాళ్ళు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో, “ఇశ్రాయేలు ప్రజలారా! మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందర్ని మందిరంలోకి పిలుచుకొని వెళ్ళి, ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేసాడు” అని బిగ్గరగా అన్నారు.