సాదోకు కుటుంబానికి చెందిన ప్రముఖ యాజకుడు అజర్యా రాజైన హిజ్కియాతో యిలా చెప్పాడు: “ప్రజలు ఆలయానికి కానుకలు తేవటం మొదలు పెట్టినప్పటి నుండి తినటానికి మాకు సమృద్ధిగా ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. అంతేగాదు, మా వద్ద ఇంకా అనేక పదార్థాలు మిగిలివున్నాయి. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించాడు. అందుచే మావద్ద ఇదంతా మిగిలివుంది.”
ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి.
మీరు ప్రార్థించి మాకు సహాయం చెయ్యాలి. ఎంతమంది ప్రార్థిస్తే దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు మాకు ఆ సహాయం చేసాక, అందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం కలుగుతుంది.
ఇవన్నీ మీ కోసమే జరుగుతున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవాలనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్పించే కృతజ్ఞతలు పెరుగుతూ పోవాలని యిందులోని ఉద్దేశ్యం.
పైగా, అతడు మా వెంట ఉండి, మాతో సహా ఈ కానుకను తీసుకు వెళ్ళాలని సంఘాలు అతణ్ణి ఎన్నుకొన్నాయి. మేమీకానుక ప్రభువు మహిమ కోసం తీసుకు వెళ్తున్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని చూపాలని మా ఉద్దేశ్యం.