సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతునియందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.