అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధపరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.
అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.
ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచెమైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరించును.