వారు ప్రతి ఉదయం, సాయంకాలం యెహోవాకు దహనబలులు అర్పిస్తూ, సుగంధద్రవ్యాలతో ధూపం వేస్తూ, పవిత్రమైన బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ, బంగారు దీపస్తంభాన్ని, ప్రమిదలను ప్రతి సాయంత్రం వెలిగిస్తూ ఉన్నారు. మేము మా దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన ఆజ్ఞల ప్రకారం సమస్తాన్నీ జరిగిస్తున్నాం. కానీ మీరు మాత్రం ఆయన్ని విడిచిపెట్టారు.”
ప్రత్యక్ష గుడారంలో శాసనాల అడ్డతెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం దాకా అది వెలుగుతూ ఉండేలా యెహోవా సన్నిధిలో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం.
మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను, చావు నీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పై నుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేశాడు.”
“చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. ఆ వెలుగు యేసు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తోంది.