“సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.
అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు.
పాపిష్ఠి దేశానికి శ్రమ, ఆ ప్రజల దోషం గొప్పది, వారిది దుష్ట సంతానం, అవినీతికి అప్పగించబడిన పిల్లలు! వారు యెహోవాను విడిచిపెట్టారు; ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని తృణీకరించారు. వారు ఆయనను విడిచి తొలగిపోయారు.
ఎందుకంటే వారు నన్ను విడిచిపెట్టి, ఈ స్థలాన్ని ఇతర దేవతల స్థలంగా చేశారు. వారికి గాని, వారి పూర్వికులకు గాని, యూదా రాజులకు గాని తెలియని దేవతలకు ధూపం వేసి, ఈ స్థలాన్ని నిర్దోషుల రక్తంతో నింపారు.
“నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు.
నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.
ఆయన అతన్ని ఎడారి ప్రదేశంలో, శబ్దాలు వినబడే బంజరు భూమిలో కనుగొన్నారు. తన గూడును కదిలించి, తన పిల్లల పైగా అల్లాడుతూ ఉండే, వాటిని పైకి తీసుకెళ్లడానికి దాని రెక్కలు చాపి వాటిని పైకి మోసుకెళ్లే గ్రద్దలా, ఆయన అతన్ని చుట్టూ ఆవరించి సంరక్షిస్తూ, తన కనుపాపలా ఆయన అతన్ని కాపాడారు.