Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

జెఫన్యా 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఇది యూదా రాజైన ఆమోను కుమారుడు యోషీయా పాలనలో జెఫన్యాకు యెహోవా నుండి వచ్చిన వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు, కూషీ గెదల్యా కుమారుడు, గెదల్యా అమర్యా కుమారుడు, అమర్యా హిజ్కియాకు కుమారుడు.


యెహోవా దినాన భూమి అంతటికి తీర్పు

2 “భూమి మీద ఏమీ మిగలకుండా నేను సమస్తాన్ని తుడిచివేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

3 “మనుష్యులను మృగాలను తుడిచివేస్తాను; ఆకాశంలో ఎగిరే పక్షులను, సముద్రంలోని చేపలను తుడిచివేస్తాను, దుర్మార్గులను పడిపోయేలా చేసే విగ్రహాలను తుడిచివేస్తాను.” “నేను మానవజాతి అంతటిని భూమి మీద ఉండకుండా చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

4 “యూదా వారి మీద, యెరూషలేములో నివసిస్తున్న వారందరి మీద నా చేయి చాపుతాను. ఈ స్థలంలో మిగిలి ఉన్న బయలు దేవత ఆరాధికులను ఆ విగ్రహాన్ని పూజించేవారి పూజారుల పేర్లతో సహా నిర్మూలిస్తాను.

5 మిద్దెమీద ఎక్కి ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని, యెహోవా పేర మోలెకు దేవత పేర మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను.

6 యెహోవాను అనుసరించకుండా ప్రక్కకు తిరిగినవారిని ఆయనను వెదకకుండ, ఆయన దగ్గర విచారణ చేయనివారిని నాశనం చేస్తాను.”

7 ప్రభువైన యెహోవా దినం సమీపించింది, కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. యెహోవా బలి సిద్ధం చేశారు; తాను ఆహ్వానించిన వారిని ఆయన పవిత్రపరిచారు.

8 “యెహోవా ఏర్పరచిన బలి దినాన నేను అధికారులను, రాజకుమారులను, విదేశీయుల్లా దుస్తులు వేసుకున్నవారందరిని శిక్షిస్తాను.

9 ఆ రోజున, ఇంటి గుమ్మం దాటివచ్చి, తమ దేవతల మందిరాన్ని హింసతో మోసంతో నింపేవారందరినీ నేను శిక్షిస్తాను.

10 “ఆ దినాన యెరూషలేములో ఉన్న చేప ద్వారం నుండి ఏడుపు, పట్టణ దిగువ భాగం నుండి రోదన, కొండల దిక్కునుండి గొప్ప నాశనం వస్తుంది, అని యెహోవా ప్రకటిస్తున్నారు.

11 వర్తక ప్రాంతంలో నివసించేవారలారా! రోదించండి; నీ వర్తకులంతా తుడిచివేయబడతారు, వెండితో వ్యాపారం చేసేవారంతా నాశనం చేయబడతారు.

12 ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై ‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ, ఆత్మసంతృప్తితో ఉన్నవారిని నేను శిక్షిస్తాను.

13 వారి ధనం దోపిడి అవుతుంది, వారి ఇల్లు పాడవుతాయి. వారు ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించలేరు; వారు ద్రాక్షతోటలు నాటినా వాటి ద్రాక్షరసం త్రాగలేరు.”

14 యెహోవా మహాదినం సమీపంగా ఉంది, అది ఆసన్నమై త్వరగా రాబోతుంది. యెహోవా దినాన ఏడ్పు భయంకరంగా ఉంటుంది; ఆ దినాన బలాఢ్యులు ఘోరంగా ఏడుస్తారు.

15 ఆ దినం ఉగ్రత దినం; బాధ, వేదన కలుగుతుంది. అది నాశనం, ధ్వంసం, చీకటి అంధకారం కమ్మే దినం, మబ్బులు, గాఢాంధకారం కమ్మే రోజు.

16 ప్రాకార పట్టణాల దగ్గర ఎత్తైన గోపురాల దగ్గర యుద్ధఘోష, బాకానాదం వినబడే రోజు.

17 “ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. వారి రక్తం దుమ్ములా, వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.

18 యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan