జెకర్యా 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయెహోవా వైపు తిరగమని పిలుపు 1 దర్యావేషు పరిపాలన రెండవ సంవత్సరం ఎనిమిదో నెలలో, ఇద్దో కుమారుడు బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు: 2 “యెహోవా మీ పూర్వికుల మీద చాలా కోపంగా ఉన్నారు. 3 కాబట్టి నీవు ఈ ప్రజలతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను’ అని సైన్యాల యెహోవా అంటున్నారు. 4 ప్రవక్తలు మీ పూర్వికులతో, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ చెడు అలవాట్లన్నింటినీ మానుకోండి’ అని చెప్పినప్పుడు వినని, పట్టించుకోని మీ పూర్వికుల్లా మీరు ఉండకండి, అని యెహోవా ప్రకటిస్తున్నారు. 5 ఇప్పుడు మీ పూర్వికులు ఏమయ్యారు? ఆ ప్రవక్తలు ఏమయ్యారు, వారు ఎల్లకాలం బ్రతికి ఉంటారా? 6 అయితే నా సేవకులైన ప్రవక్తలకు నేను ఆదేశించిన మాటలు శాసనాలు మీ పూర్వికుల విషయంలో నెరవేరలేదా? “అవి నెరవేరినప్పుడు వారు పశ్చాత్తాపపడి, ‘మన ప్రవర్తనకు మన పనులకు తగినట్లుగా సైన్యాల యెహోవా తాను చేయాలనుకున్న ప్రకారం మనకు చేశారు’ అని చెప్పుకున్నారు.” గొంజిచెట్ల మధ్యలో ఉన్న మనిషి 7 దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం శెబాతు అనే పదకొండవ నెల ఇరవై నాల్గవ రోజున ఇద్దో కుమారుడైన బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు. 8 రాత్రి సమయంలో నాకు దర్శనం వచ్చింది, అక్కడ నా ఎదుట ఎర్రని గుర్రంపై ఎక్కిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక లోయలోని గొంజిచెట్ల మధ్య నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, గోధుమరంగు గుర్రాలు, తెలుపు గుర్రాలు ఉన్నాయి. 9 అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. నాతో మాట్లాడుతున్న ఆ దూత, “అవేంటో నీకు చూపిస్తాను” అని చెప్పాడు. 10 అప్పుడు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన వ్యక్తి, “ఇవి భూమి అంతా తిరగడానికి యెహోవా పంపించిన గుర్రాలు” అని చెప్పాడు. 11 వారు గొంజిచెట్ల మధ్యలో నిలబడిన యెహోవా దూతతో, “మేము లోకమంతటా తిరిగి వచ్చాము. లోకమంతా ప్రశాంతంగా సమాధానంగా ఉండడం చూశాం” అన్నారు. 12 అప్పుడు యెహోవా దూత, “సైన్యాల యెహోవా, డెబ్బై సంవత్సరాలుగా మీరు యెరూషలేము మీద, యూదా పట్టణాల మీద కోపంతో ఉన్నారు, ఇంకెన్నాళ్లు వరకు కనికరించకుండా ఉంటారు?” అని మనవి చేశాడు. 13 కాబట్టి నాతో మాట్లాడుతున్న ఆ దూతకు యెహోవా దయగల ఆదరణ కలిగించే మాటలు చెప్పారు. 14 ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న దూత ఇలా అన్నాడు, “నీవు ఈ మాటను ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెరూషలేము, సీయోను గురించి నేనెంతో ఆసక్తి కలిగి ఉన్నాను. 15 నిశ్చింతగా బ్రతుకుతున్న ఇతర జాతులపై నేను చాలా కోపంగా ఉన్నాను. గతంలో నేను కొంచెమే కోప్పడ్డాను, కానీ వారు ఆ శిక్షను చాలా తీవ్రం చేసుకున్నారు.’ 16 “కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను కనికరంతో యెరూషలేము వైపు తిరుగుతాను, అక్కడ నా మందిరం తిరిగి కట్టబడుతుంది. యెరూషలేము మీద నిర్మాణకులు కొలతలు వేస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. 17 “ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ” నాలుగు కొమ్ములు, నలుగురు కంసాలులు 18 తర్వాత నేను పైకి చూసినప్పుడు అక్కడ నాలుగు కొమ్ములు కనిపించాయి. 19 నాతో మాట్లాడుతున్న దూతను, “ఇవి ఏంటి?” అని అడిగాను. అందుకతడు, “ఇవి యూదా, ఇశ్రాయేలు, యెరూషలేములను చెదరగొట్టిన కొమ్ములు” అని చెప్పాడు. 20 అప్పుడు యెహోవా నాకు నలుగురు కంసాలులను చూపించారు. 21 “వీరు ఏమి చేయడానికి వస్తున్నారు?” అని నేను అడిగాను. అందుకాయన, “ఎవ్వరూ తమ తల ఎత్తకుండ యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే కంసాలులు వారిని భయభ్రాంతులకు గురిచేసి, యూదా దేశంలోని ప్రజలను చెదరగొట్టడానికి తమ కొమ్ములను ఎత్తిన దేశాల కొమ్ములను పడగొట్టడానికి వచ్చారు” అని అన్నారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.