రోమా పత్రిక 16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంవ్యక్తిగత శుభాలు 1 కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలైన మన సహోదరి ఫీబే గురించి మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. 2 నేను మిమ్మల్ని కోరేదేంటంటే ఆమెను ఆయన ప్రజలకు తగినట్లు ప్రభువులో చేర్చుకొని, ఆమెకు ఏమైనా సహాయం అవసరమైతే చేయండి. ఎందుకంటే ఆమె నాతో పాటు అనేకమందికి ప్రయోజనకరంగా ఉంది. 3 యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు వందనాలు తెలియజేయండి. 4 వారు నా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. నేనే కాదు యూదేతరుల సంఘాల వారందరు వారికి కృతజ్ఞులై ఉన్నారు. 5 అలాగే వారి ఇంట్లో కూడుకునే సంఘానికి కూడా వందనాలు తెలియజేయండి. ఆసియా ప్రాంతంలో మొదటిగా క్రీస్తును అంగీకరించిన నా స్నేహితుడైన ఎపైనెటుకు వందనాలు తెలియజేయండి. 6 మీ కోసం ఎంతో కష్టపడిన మరియకు వందనాలు తెలియజేయండి. 7 నా తోటి ఖైదీలు అంద్రొనీకు, యూనీయలకు శుభాలు చెప్పండి. వీరు అపొస్తలుల్లో పేరు పొందినవారు, నాకంటే ముందు క్రీస్తులో ఉన్నవారు. 8 ప్రభువులో నాకు ప్రియ స్నేహితుడైన అంప్లీయతుకు వందనాలు తెలియజేయండి. 9 క్రీస్తులో మన తోటిపనివాడైన ఊర్బాను నా ప్రియ స్నేహితుడైన స్టాకులకు వందనాలు తెలియజేయండి. 10 క్రీస్తులోని విశ్వాసానికి పరీక్షను ఎదుర్కొని నిలబడిన అపెల్లెకు వందనాలు తెలియజేయండి. అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వారికి వందనాలు తెలియజేయండి. 11 నా తోటి యూదుడైన హెరోదియోనుకు వందనాలు తెలియజేయండి. నార్కిస్సు కుటుంబంలో ప్రభువులో ఉన్నవారందరికి వందనాలు తెలియజేయండి. 12 ప్రభువులో ప్రయాసపడిన స్త్రీలు త్రుపైనాకు త్రుఫోసాలకు వందనాలు తెలియజేయండి. ప్రభువులో ఎంతో కష్టపడిన నా స్నేహితురాలైన పెర్సిసుకు వందనాలు తెలియజేయండి. 13 ప్రభువులో ఏర్పరచబడిన రూఫసుకు అతని తల్లికి వందనాలు తెలియజేయండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిదే. 14 అసుంక్రితు, ప్లెగోను, హెర్మెసు, పత్రొబ, హెర్మా, వారితో పాటు ఉంటున్న సహోదరీ సహోదరులకు వందనాలు తెలియజేయండి. 15 పిలొలొగు, జూలియా, నేరియ, అతని సహోదరి ఒలింపాకు, వారితో పాటు ఉన్న పరిశుద్ధులందరికి వందనాలు తెలియజేయండి. 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు తెలియజేసుకోండి. క్రీస్తు సంఘాలన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాయి. 17 సహోదరీ సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధలకు వ్యతిరేకంగా మీ మార్గాల్లో ఆటంకాలు కలిగిస్తూ భేదాలు పుట్టించేవారిని జాగ్రత్తగా గమనించమని వేడుకుంటున్నాను. వారికి దూరంగా ఉండండి. 18 ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ ఆకలినే తీర్చుకుంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు. 19 మీ విధేయత గురించి ప్రతి ఒక్కరు విన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషులుగా ఉండాలని నేను కోరుతున్నాను. 20 సమాధానకర్తయైన దేవుడు త్వరలో తన పాదాల క్రింద సాతానును నలిపివేస్తారు. మన ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక. 21 నా సహపనివాడైన తిమోతి అలాగే నా తోటి యూదులైన లూకియా, యూసోను, సోసిపత్రు అనేవారు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు. 22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. 23 నేను అలాగే సంఘమంతా ఆనందించేలా ఆతిథ్యమిచ్చే గాయి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ పట్టణ ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిగా ఉన్న ఎరస్తు, మన సహోదరుడైన క్వర్తు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు. 24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్. 25-27 యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.