ప్రకటన 6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంముద్రలు 1 వధించబడిన గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పుతున్నప్పుడు నేను చూశాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి ఉరుముతున్న స్వరంతో, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. 2 నేను చూస్తుండగా ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్లాడు. 3 ఆ వధించబడిన గొర్రెపిల్ల రెండవ ముద్రను విప్పినప్పుడు, రెండవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. 4 అప్పుడు మండుతున్న ఎర్రని మరొక గుర్రం బయలుదేరింది; దాని మీద స్వారీ చేసేవానికి భూమి మీద నుండి సమాధానం తీసివేయడానికి, ప్రజలు ఒకరిని ఒకరు చంపుకొనేలా చేయటానికి అధికారం ఇవ్వబడింది. అతనికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. 5 ఆ వధించబడిన గొర్రెపిల్ల మూడవ ముద్రను విప్పినప్పుడు, మూడవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు నాకు ఒక నల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాడు చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు. 6 ఆ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “ఒక రోజు జీతానికి ఒక కిలో గోధుమలు, ఒక రోజు జీతానికి మూడు కిలోల యవల గింజలు. అయితే ఒలీవల నూనెను ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు!” అని చెప్పడం విన్నాను. 7 ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. 8 అప్పుడు నాకు బూడిద రంగు గుర్రం కనబడింది. దాని మీద సవారిచేసేవాని పేరు మృత్యువు, పాతాళం అతన్ని అతి సమీపంగా వెంబడిస్తుంది. ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో ఇంకా భూమి మీద ఉండే క్రూర మృగాలతో ప్రజలను చంపడానికి భూమి నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వబడింది. 9 ఆ వధించబడిన గొర్రెపిల్ల అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూశాను. 10 వారు పెద్ద స్వరంతో, “ఓ సర్వశక్తిగల ప్రభువా! పరిశుద్ధుడా, సత్యవంతుడా, మా రక్తానికి ప్రతిగా భూనివాసులను తీర్పు తీర్చడానికి ఇంకా ఎంతకాలం?” అని కేకలు వేశారు. 11 అప్పుడు వారిలో అందరికి తెల్లని వస్త్రాలను ఇచ్చి, “మీలాగే ఇంకా హతులైన మీ తోటి సేవకుల, సహోదరీ సహోదరుల సంఖ్య పూర్తయ్యే వరకు ఇంకా కొంతకాలం వేచి ఉండాలి” అని వారికి చెప్పబడింది. 12 ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. అప్పుడు సూర్యుడు మేక బొచ్చుతో చేసిన గోనెపట్టలా నల్లగా మారాడు, చంద్రుడు రక్తంలా ఎర్రగా మారాడు. 13 బలమైన గాలికి అంజూర చెట్టు నుండి రాలిపడిన కాయల్లా ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయి. 14 ఆకాశం ఒక గ్రంథపుచుట్టలా చుట్టుకుపోయింది, ప్రతి పర్వతం ప్రతి ద్వీపం వాటి వాటి స్థలాల నుండి తొలగిపోయాయి. 15 భూ రాజులు, రాకుమారులు, ప్రధానులు, ధనవంతులు, బలవంతులు, దాసులు, స్వతంత్రులు ప్రతి ఒక్కరు గుహల్లో, కొండల రాళ్ల సందుల్లో దాక్కున్నారు. 16 వారు కొండలతో, బండలతో, “మీరు మామీద వచ్చి పడండి! సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ముఖం నుండి వధించబడిన గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని దాచి పెట్టండి! 17 ఎందుకంటే వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది, దాన్ని ఎవరు తట్టుకోగలరు?” అని వేడుకొంటున్నారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.