Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రకటన 3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


సార్దీసు సంఘానికి వర్తమానం

1 “సార్దీసులో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: దేవుని ఏడు ఆత్మలు, ఏడు నక్షత్రాలు కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు; నీవు బ్రతికున్నావని పేరు ఉంది కాని నీవు చచ్చిన దానివే.

2 మేల్కో! నా దేవుని దృష్టిలో నీ క్రియలు సంపూర్తి అయినట్లు నాకు కనిపించలేదు కాబట్టి చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచు.

3 కాబట్టి నీవు పొందిన వాటిని విన్నవాటిని జ్ఞాపకం చేసుకుని, వాటిని పాటిస్తూ గట్టిగా పట్టుకుని పశ్చాత్తాపపడు. కాని నీవు మేలుకోక పోతే నేను దొంగలా వస్తాను, నేను ఏ సమయంలో నీ దగ్గరకు వస్తానో నీకు తెలియదు.

4 అయినా సార్దీసులో నీ దగ్గర ఉన్న కొందరు తమ వస్త్రాలను మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు కాబట్టి వారు తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో పాటు నడుస్తారు.

5 జయించేవారు వారిలా తెల్లని వస్త్రాలు ధరించుకొంటారు. వాని పేరును నేను జీవగ్రంథంలో నుండి ఎన్నడు తుడిచివేయను. నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు వాని పేరును ఒప్పుకుంటాను.

6 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.


ఫిలదెల్ఫియ సంఘానికి వర్తమానం

7 “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: దావీదు తాళపు చెవిని కలిగి ఉన్న సత్యవంతుడైన పరిశుద్ధుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన తెరచిన దాన్ని ఎవరూ మూయలేరు, ఆయన మూసిన దాన్ని ఎవరూ తెరవలేరు.

8 నీ క్రియలు నాకు తెలుసు. ఎవరు మూయలేని ద్వారం నేను నీ ముందు తెరచి ఉంచాను. నీకు కొద్ది బలమే ఉన్నా నీవు నా వాక్యాన్ని పాటించి జీవిస్తూ నా పేరును తిరస్కరించలేదని నాకు తెలుసు.

9 యూదులు కాకుండానే తాము యూదులమని అబద్ధాలు చెప్పుకొనే సాతాను సమాజమందిరానికి చెందిన వారందరిని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల ముందు సాగిలపడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని వారు ఒప్పుకునేలా చేస్తాను.

10 నేను నీకు ఆజ్ఞాపించినట్లే నీవు సహనంతో సహించావు కాబట్టి భూనివాసులు అందరిని పరీక్షించడానికి లోకం మీద రానున్న శోధన సమయంలో నేను నిన్ను కాపాడతాను.

11 నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.

12 జయించినవారిని నా దేవాలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. అప్పుడు వారు దానిలో నుండి ఎన్నడూ బయటకు వెళ్లరు. వారి మీద నేను నా దేవుని పేరును పరలోకంలో ఉన్న నా దేవుని నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనే నా దేవుని పట్టణం పేరును, నా క్రొత్త పేరును కూడా వ్రాస్తాను.

13 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలు చెవులుగలవారు వినాలి.


లవొదికయ సంఘానికి వర్తమానం

14 “లవొదికయలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: ఆమేన్ అనేవాడు, నమ్మకమైనవాడు, సత్య సాక్షి, దేవుని సృష్టిని పరిపాలించేవాడు ఈ మాటలు చెప్తున్నాడు.

15 నీ క్రియలు నాకు తెలుసు, నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేవు. నీవు చల్లగా కాని వెచ్చగా కాని ఉంటే మంచిది.

16 నీవు చల్లగా కాని వెచ్చగా కాని లేకుండా నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను.

17 నీవు, ‘నేను ధనవంతున్ని నేను చాలా ఆస్తులను సమకూర్చుకొన్నాను కాబట్టి నాకు ఏ లోటులేదని’ అంటున్నావు కాని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, బీదవాడవు, గ్రుడ్డివాడివి, దిగంబరివని నీకు తెలియదు.

18 నీవు ధనవంతునివి అయ్యేలా అగ్నిలో పుటం వేసిన బంగారాన్ని, అవమానకరమైన నీ దిగంబరత్వం కనబడకుండా ధరించుకోవడానికి తెల్లని వస్త్రాన్ని, నీవు చూడగలిగేలా నీ కళ్లకు మందు నా దగ్గర కొనుక్కో అని నేను నీకు సలహా ఇస్తున్నాను.

19 నేను ప్రేమించేవారిని గద్దించి శిక్షిస్తాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు.

20 ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వారితో నేను, నాతో వారు భోజనం చేస్తాము.

21 నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించినవారిని నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోనిస్తాను.

22 ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan