కీర్తన 8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 8 సంగీత దర్శకునికి. గిత్తీతు రాగములో పాడదగినది. దావీదు కీర్తన. 1 యెహోవా, మా ప్రభువా, భూలోకమంతట మీ నామం ఎంతో ప్రభావవంతమైనది! మీరు ఆకాశాల్లో మీ మహిమను ఉంచారు. 2 చిన్నపిల్లల చంటిబిడ్డల స్తుతుల ద్వారా, మీ శత్రువుల పగవారి నోరు మూయించడానికి మీ శత్రువులకు వ్యతిరేకంగా మీరు బలమైన కోటను స్థాపించారు. 3 మీ చేతి పనియైన మీ ఆకాశాలను, మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు, 4 మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు? 5 మీరు వారిని దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశారు, మహిమ ఘనతను వారికి కిరీటంగా పెట్టారు. 6 మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా: 7-8 గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను వారి పాదాల క్రింద ఉంచారు. 9 యెహోవా, మా ప్రభువా, భూమి అంతట మీ నామం ఎంతో ఘనమైనది! |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.